Wednesday, January 22, 2025

”ఆ వ్యక్తి” వల్లే చల్లారని కశ్మీరు చిచ్చు

- Advertisement -
- Advertisement -

PM Modi targets Jawaharlal Nehru over Kashmir issue

నెహ్రూపై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు

ఆనంద్: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రానంతరం దేశంలోని సంస్థానాల విలీనం సమస్యను సర్దార్ వల్లభాయ్ పటేల్ పరిష్కరించారని, కాని ”ఒక వ్యక్తి” మాత్రం కశ్మీరు సమస్యను పరిష్కరించలేకపోయారని ప్రధాని మోడీ ఆరోపించారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన వల్లభ్ విద్యానగర్‌లో సోమవారం ఒక బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ అడుగుజాడల్లో నడుస్తున్న తాను దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీరు సమస్యను పరిష్కరించగలిగానని చెప్పారు. సర్దార్ పటేల్ మానసిక పుత్రిక సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ”అర్బన్ నక్సల్స్” ప్రయత్నించారని కూడా ఆయన ఆరోపించారు. భారతదేశంలో విలీనం కావాలంటూ అన్ని సంస్థానాలను సర్దార్ పటేల్ నచ్చచెప్పి ఒప్పించారని, కాని.. కశ్మీరు సమస్యను మరో వ్యక్తి మాత్రం చక్కబెట్టలేకపోయారంటూ పరోక్షంగా నెహ్రూపై ప్రధాని విమర్శనాస్త్రాలు సంధించారు.

సర్దార్ పటేల్ అడుగుజాడల్లో నడిచే తాను మాత్రం ఆయన జన్మభూమికి చెందిన విలువలకు కట్టుబడి కశ్మీరు సమస్యను పరిష్కరించానని, ఇదే తాను సర్దార్ పటేల్‌కు ఇచ్చే నిజమైన నివాళులని మోడీ చెప్పారు. గుజరాత్‌లో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రస్తావిస్తూ డ్యాంలు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు నీటిని తరలించేందుకు కాల్వల వ్యవస్థను నిర్మించలేదని విమర్శించారు. దర్శనం కోసమే డ్యాంలు నిర్మించారా అంటూ ఆయన ప్రశ్నించారు. కాల్వల నిర్మాణ పనులను తాను చేపట్టి 20 ఏళ్లలో పూర్తి చేశానని ఆయన చెప్పారు. దీని వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం నీరు చేరుకున్నందున వ్యవసాయ ఉత్పత్తులలో రాష్ట్రం 9 నుంచి 10 శాతం ప్రగతిని సాధించిందని ఆయన చెప్పారు. సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ”అర్బన్ నక్సల్స్” ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. వారి వల్ల 40, 50 ఏళ్ల కాలం వృథా అయిందని, కోర్టుల చుట్టూ తిరిగి గుజరాత్ ప్రజల ధనం వృథా అయిందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా..నేడు సర్దార్ పటేల్ కలల ప్రాజెక్టు సరోవర్ సరోవర్ డ్యాం నిర్మాణం పూర్తి చేసుకున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నాయకులు కనపడితే సర్దార్ పటేల్ గౌరవార్థం నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తయిన ఐక్యతా మూర్తి విగ్రహాన్ని దర్శించారా అని ప్రశ్నించండని ఆయన బిజెపి కార్యకర్తలనుద్దేశించి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News