హైదరాబాద్: సంక్రాంతి తర్వాత తెలంగాణలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఈనెల 19 లేదా 20 తేదీలలో రాష్ట్రానికి ప్రధాని మోడీ వచ్చే అవకాశం ఉంది. దక్షిణ మధ్య రైల్వే తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆయన ప్రారంభించనున్నారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోనే ప్రధాని మోడీ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ నుంచి కాజీపేట మీదుగా విజయవాడ వరకు ఈనెలలో నడపాలని రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 1129 మంది సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ రైలును రానున్న రోజుల్లో విశాఖపట్నం వరకు విస్తరించనున్నారు. సికింద్రాబాద్ విజయవాడ మధ్య నడవనున్న ఈ రైలు గరిష్ట వేగం 180 కిలో మీటర్లు. దీంతో ఈ మార్గంలో ట్రాక్ సామర్ధాన్ని 180 కిలో మీటర్ల వరకు పెంచారు. ఇప్పటికే ట్రయిల్ రన్ కూడా నిర్వహించారు. మరికొన్ని రోజుల పాటు ఈ ట్రయిల్ రన్‌ను కొనసాగించనున్నారు. గంటకు 180 కిలో మీటర్ల వేగం కాబట్టి సికింద్రాబాద్ విజయవాడ మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది.
దేశంలో ఇప్పటికే ఏడు వందే భారత్ ఎక్స్‌రరపెస్ రైళ్ళు ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెసిందే. తాజాగా తెలంగాణలో ఎనిమిదో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిష్టం, వైఫై, సౌకర్యవంతమైన సీటింగ్ ఈ రైలు ప్రత్యేకత. ఇదిలావుండగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడవనుంది. ఈ రైలును సికింద్రాబాద్ వయా విజయవాడ మీదుగా తిరుపతికి నడపాలని దక్షిణ మధ్య రైల్వే కేంద్రాన్ని కోరింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవల్సివుంది.