Saturday, November 23, 2024

శుభ సంకేతం

- Advertisement -
- Advertisement -

PM Modi Tells Putin Now Is Not a Time For War బాగా కాలిన ఇనుము మీద సమ్మెట దెబ్బ వేస్తే అది మనం కోరుకున్న రూపంలోకి లొంగుతుంది. ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మానసిక స్థితి ఇప్పుడు ఇదే మాదిరిగా వుందని బోధపడుతున్నది. ఉబ్జెకిస్తాన్ లోని సమర్కండ్‌లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోడీ చేసిన హితబోధ పుతిన్ చెవికెక్కిందని వార్తలు చెబుతున్నాయి. ‘ఇది యుద్ధాల యుగం కాదు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి తెర దించాలి’ అని పుతిన్‌కు మోడీ శుక్రవారం నాడు హితబోధ చేశారని అందుకు ఆయన నుంచి సానుకూల ప్రతిస్పందన వచ్చిందని వార్తలు చెబుతున్నాయి. ‘ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మీ వైఖరి, మీరు దాని గురించి తరచూ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం నాకు తెలుసు. యుద్ధాన్ని వీలైనంత తొందరగా విరమించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తాం’ అని పుతిన్ సమాధానమిచ్చినట్టు సమాచారం. ఇది అపూర్వమైన, అసాధారణమైన పరిణామం. ప్రధాని మోడీ మాటకు విలువ ఇచ్చి పుతిన్ సానుకూలంగా వ్యక్తం కావడం హర్షించదగిన అంశం.

అయితే ఇందుకు ముందు గురువారం నాడు ఉక్రెయిన్ పట్ల చైనా తమతో పూర్తిగా ఏకీభవించడం లేదని పుతిన్ వెల్లడించారు. ముందుగానే చైనా అధినేత జీ జిన్‌పింగ్ యుద్ధం కొనసాగడం పట్ల తన అసంతృప్తిని పుతిన్‌కు తెలియజేశారని అర్థమవుతున్నది. గత ఫిబ్రవరి 20న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించింది. రష్యా తన లక్షాన్ని తొందరలోనే సాధించుకొని యుద్ధానికి స్వస్తి చెప్పగలదని ఆరంభంలో అనిపించింది. అమెరికా, నాటో పరోక్షంగా రంగ ప్రవేశం చేయడంతో యుద్ధం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఉక్రెయిన్ అధ్యక్షడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ విజ్ఞప్తిని సాకుగా తీసుకొని అమెరికా భారీ ఎత్తున ఆయుధ సహాయం చేయడంతో యుద్ధ రంగం రోజురోజుకూ మరింతగా భీషణ రూపం ధరించింది. ఉక్రెయిన్ సేనల ప్రతిఘటన బలోపేతమైంది. దానితో మాస్కో కూడా అదనపు బలగాలతో యుద్ధ తీవ్రతను పెంచింది. అది ఇప్పటికీ కొనసాగుతున్నది. తాజాగా ఉక్రెయిన్ సేనల ఎదురుదాడి ఫలిస్తున్నదని రష్యా ఆక్రమించుకొన్న భూభాగాన్ని తిరిగి అవి స్వాధీనం చేసుకొంటున్నాయని వార్తలు వచ్చాయి.

అయినప్పటికీ రష్యాదే పై చేయిగా వున్నదని బోధపడుతున్నది. ఎందుకంటే యుద్ధంలో ఉక్రెయిన్ పట్టు కోల్పోయిన భూభాగం విస్తీర్ణం 1,27,484 కి.మీ అయితే ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకొన్నది కేవలం మూడు వేల చదరపు కిలోమీటర్లేనని ఒక సమాచారం. ఏమైనప్పటికీ యుద్ధం కొనసాగే కొద్దీ రష్యా సేనలు నైతిక స్థైర్యం కోల్పోయే ప్రమాదం కనిపిస్తున్నది. అందుకే పుతిన్ పునరాలోచనలో పడి వుండొచ్చు. యుద్ధ ప్రభావం వల్ల అమెరికా సహా అన్ని దేశాలకు కష్టాలెదురయ్యాయి. ఆఫ్రికన్ తదితర కొన్ని దేశాలకు ఆహార కొరత కూడా ఏర్పడింది. ఇండియాలో కూడా ఆహార సరకుల ధరల మంటలు మరింత విజృంభించాయి. రష్యా, ఉక్రెయిన్ల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్, గోధుమ, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటివాటి ధరలు పెరిగిపోయాయి. యుద్ధానికి ముందు ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో దాదాపు 30 శాతం ఈ రెండు దేశాల నుంచే వచ్చేది. యుద్ధం వల్ల నల్లసముద్ర రేవులు దాదాపు మూతపడడంతో ఈ ఎగుమతులకు అంతరాయం కలిగింది. అలాగే ఆహారంలో చాలా కీలక పాత్ర వహించే సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో 60 శాతం రష్యా, ఉక్రెయిన్ల నుంచే లభిస్తూ వచ్చేది. దీని సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. యూరపు దేశాలు వినియోగిస్తున్న గ్యాస్‌లో 40 శాతం, క్రూడాయిల్‌లో 27 శాతం వరకు రష్యా నుంచే వస్తూ వుండేది. ఇప్పుడీ సరఫరాను రష్యా నిలిపివేసింది. దీనితో చలికాలాన్ని తట్టుకోడం ఎలా అనే ఆందోళన ఆ దేశాల్లో పెరుగుతున్నది. మరొక వైపు రష్యా నుంచి ఇండియాకు చవకగా ఆయిల్ లభ్యమవుతున్నది. అమెరికా కూటమి మాదిరిగా యుద్ధం విషయంలో రష్యాను ఆక్షేపించకుండా తటస్థ వైఖరి వహించినందు వల్ల ఇండియాకు ఈ ప్రయోజనం కలుగుతున్నది.

గతంలో తన ఆయిల్ అవసరాల్లో కేవలం 0.2 శాతం మేరకు మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటూ వచ్చిన ఇండియా ఇప్పుడు దానిని అనేక రెట్లు పెంచింది. ప్రస్తుతం మన ఆయిల్ దిగుమతుల్లో 10 శాతం రష్యా నుంచి దిగుమతి అవుతుండడం గమనించవలసిన విషయం. అయితే యుద్ధం నిరవధికంగా కొనసాగితే ప్రపంచ మీద దాని దుష్ప్రభావం అపరిమితంగా వుంటుంది. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి అసంఖ్యాకంగా ప్రజలు వలసలు వెళ్లిపోయారు. నిర్వాసితులై పొట్ట చేత పట్టుకొని దేశంలోని సురక్షిత ప్రాంతాలకు, విదేశాలకు తరలిపోయారు. ఆహార సంక్షోభం వల్ల అనేక దేశాలు కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఆయిల్ ధరలు పెరిగిపోయి ప్రపంచ వ్యాప్తంగా సాధారణ ప్రజల జీవనం దుర్భరమవుతున్నది. అందుచేత భారత, చైనాల మాట విని పుతిన్ ఈ యుద్ధానికి త్వరలోనే స్వస్తి చెబుతారని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News