న్యూఢిల్లీ: జాతీయ విద్యా విధానం-2020 కింద సంస్కరణలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం విద్య, నైపుణ్యాభివృద్ధి రంగానికి చెందిన విధాన రూపకర్తలతోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి వీడియా కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగిస్తారు. ఉన్నత విద్యలో విద్యార్థుల ప్రవేశానికి, నిష్క్రమణకు సంబంధించిన బహుళ అవకాశాలతో కూడిన అకాడెమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్‌తోపాటు ప్రాంతీయ భాషలలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ తరగతులు, ఉన్నత విద్య అంతర్జాతీయీకరణకు మార్గదర్శకాలు తదితర అనేక విద్యా రంగంలో చేపడుతున్న అనేక నూతన చర్యలను ప్రధాని ప్రారంభిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కొత్తగా ప్రారంభిస్తున్న చర్యలలో గ్రేడ్ 1 విద్యార్థులకు మూడు నెలల పాఠశాల స్థాయి సన్నాహక కార్యక్రమం విద్యా ప్రవేశ్, ఉపాధ్యాయ శిక్షకు సంబంధించి ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన సమగ్ర కార్యక్రమం నిష్ట 2.0 వంటివి కూడా ఉన్నట్లు పిఎంఓ తెలిపింది. సిబిఎస్‌ఇ స్కూళ్లలో 3,5,8 గ్రేడ్ల కోసం విద్యార్థుల ప్రతిభను మదింపు చేసే సఫల్ కార్యక్రమంతోపాటు ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రధాని ప్రారంభిస్తారని పిఎంఓ తెలిపింది.