Sunday, November 17, 2024

అమెరికాకు భారత కోళ్ల రైతులు బలి

- Advertisement -
- Advertisement -

ఆదివారం నాడు మన ప్రధాని నరేంద్ర మోడీ 106వ మన్‌కీ బాత్ సుభాషితాల్లో స్థానిక వస్తువులనే కొనండి అని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ మాటలు విన్న తరువాత ఇతరులకు నీతులు చెప్పే హరిదాసు గుర్తుకు వచ్చారు. ప్రపంచంలో కోడి మాంసం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఎఫ్‌ఎఒ సంస్థ 2021 వివరాల ప్రకారం భారత్ ఆరవ స్థానంలో ఉంది. అమెరికా 2,06,52,971 టన్నులతో మొదటి స్థానంలో, చైనా 1,47,00,000, బ్రెజిల్ 1,46,36,478, రష్యా 46,17, 338, ఇండోనేషియా 38,44,346, భారత్ 36,70,156 టన్నులతో, తొలి పది స్థానాల్లో మన తరువాత మెక్సికో, జపాన్, అర్జెంటీనా, టర్కీ ఉన్నాయి.

చైనా, మన దేశం జనాభాలో ఒకే విధంగా ఉన్నప్పటికీ జనాభా కొనుగోలు శక్తి ఎక్కువ గనుక చైనా ఇంకా దిగుమతి చేసుకుంటోంది. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న కోడి మాంసం, గుడ్లనే పూర్తిగా వినియోగించ లేని స్థితిలో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.2014 2019 సంవత్సరాల్లో తలసరి సగటు కోడి మాంస వినియోగం చైనాలో 12.1 నుంచి 14.9 కిలోలకు పెరగ్గా మన దేశంలో 2.49 నుంచి 3.17 కిలోలకు పెరిగింది. పాకిస్తాన్‌లో 5.11 నుంచి 6.8 కిలోలకు పెరిగింది. ప్రపంచంలో 2021లో బహామాస్ 70.2 కిలోలతో ప్రథమ స్థానంలో ఉంది. తాజాగా నరేంద్ర మోడీ సర్కార్ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలలో భాగంగా అక్కడ తినటానికి తిరస్కరించే కోడి కాళ్లను మన దేశం దిగుమతి చేసుకొనేందుకు, భారీగా పన్ను తగ్గించేందుకు అంగీకరించింది.

అమెరికా మోజులో ఉన్న నరేంద్ర మోడీకి అక్కడి కోడి కాళ్లు, ఉత్పత్తిదారులు, వారి లాభాలు తప్ప భారతీయ కోడి మాంసం, దాని ఉత్పత్తి, మార్కెటింగ్‌లో భాగస్వాములయ్యే లక్షల మంది రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు గుర్తుకు రాలేదు. నిత్యం పారాయణం చేసే దేశభక్తి, స్వప్రయోజనాలను తుంగలో తొక్కారా లేక విశ్వగురువుగా నీరాజనాలందుకొనేందుకు అమెరికాకు దాసోహం అన్నారా? ఏడు సంవత్సరాల క్రితం మన కోళ్ల పరిశ్రమ మార్కెట్ విలువ యాభైవేల కోట్లు, 2022లో రూ. 1,90,530 కోట్లకు పెరిగింది, 2028 నాటికి రూ. 3,40,780కోట్లకు చేరుతుందని అంచనా. లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే కోడి మాంసం, ఇతర కొన్ని దిగుమతుల మీద భారీగా పన్నుల తగ్గింపును అడ్డుకొనేందుకు కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు.

కోర్టులో ఎవరు ఏం వాదిస్తారో చెప్పలేము, ప్రభుత్వ విధాన నిర్ణయాలను సాధారణంగా కోర్టులు సమర్ధిస్తాయి. అమెరికాలో కోడి బ్రెస్ట్ తప్ప కాళ్లు, లివరు తినరు, అందువలన వారికి పనికిరాని వాటిని ఇతర దేశాలకు చౌకగా ఎగుమతి చేస్తారు. అవి ఆయా దేశాల పరిశ్రమను దెబ్బ తీస్తాయి గనుక అనేక దేశాలు రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా కోళ్లు, బాతుల మాంసంతో పాటు యాపిల్స్, బాదం పప్పు, కాబూలీ (పెద్ద) సెనగలు, కాయ ధాన్యాలు తదితర వ్యవసాయ ఉత్పత్తులపై మన దేశం భారీగా దిగుమతి పన్ను తగ్గించనుంది. దిగుమతి చేసుకొనే ఉత్పత్తులతో గతం లో పంటలు, పర్యావరణాన్ని దెబ్బ తీసే కలుపు మొక్కలు, తెగుళ్ల వంటివి మన దేశానికి వచ్చాయి. 1950లో పిఎల్ 480 పేరుతో అమెరికా అందచేసిన నాసిరకం గోధుమలతో పాటు వయ్యారి భామ, కాంగ్రెస్ గడ్డి అని పిలిచే పార్థీనియం అనే విషపూరితమైన కలుపు మొక్క మన దేశానికి వచ్చింది. అదే విధంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇది వ్యాపించింది. దీని వలన మనుషులకు చర్మ, శ్వాస సంబంధమైన రుగ్మతలు కలుగుతాయని తేలింది.

2022లో అమెరికాలో బర్డ్ ఫ్లూ అనే వ్యాధితో కోట్లాది కోళ్లు మరణించాయి. వాటితో పాటు ఆ వ్యాధి మనుషులకూ వ్యాపిస్తుంది. అలాంటి అవకాశం ఉన్న చోట నుంచి కోడి, బాతు మాంస ఉత్పత్తులను దిగుమతికి నరేంద్ర మోడీ సర్కార్ తలుపులు బార్లా తెరిచి జనాల ఆరోగ్యానికి కూడా హాని తలపెట్టినట్లు అనేక మంది భావిస్తున్నారు. రెండవది అమెరికాలో కోళ్ల దాణా పశు, పంది మాంసం, ఎముకల నుంచి తయారు చేస్తారు. అలాంటి వాటితో పెంచిన కోళ్ల మాసం తినేందుకు అనేక మంది మనోభావాలు అంగీకరించవు. మోడీ సర్కార్ వాటిని పట్టించుకోలేదు.ఈ దాణాతో పెంచిన కోళ్ల, బాతుల మాంసం అని వాటి ఉత్పత్తుల మీద ప్రకటిస్తారో లేదో తెలియదు.

ఒకవేళ ప్రకటించినప్పటికీ వినియోగదారులకు అలా ముద్రించిన పాకెట్లలో సరఫరా చేస్తే అదొక దారి. హోటళ్లలో వాటిని వడ్డిస్తే వినియోగదారులు కనుక్కోలేరు. దేశ కోళ్ల పరిశ్రమ రైతులకు హాని కలిగించే ఈ ఏకపక్ష నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు భారత కోళ్ల పరిశ్రమ ఫెడరేషన్ అధ్యక్షుడు రాణ్‌పాల్ ధండా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమెరికన్ కంపెనీల లాభాలను కాదు, దేశంలోని రైతుల ప్రయోజనాలను చూడాలని అన్నారు. ఈ నిర్ణయం తో అమెరికా ఉత్పత్తిదారులకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయని, ఉత్పత్తులు మరింతగా భారత్‌లో అందుబాటులోకి వస్తాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్ తాయ్ ప్రకటించారు.

బాదం పప్పు, సెనగలు, కాయ ధాన్యాలు, యాపిల్స్ దిగుమతుల మీద పన్ను పెంచాల్సింది పోయి తగ్గించటం నరేంద్ర మోడీ సర్కార్ రైతుల ప్రయోజనాలను దెబ్బ తీయటమే అని, ఈ ఉత్పత్తులపై అమెరికా ఇచ్చే ఎగుమతి సబ్సిడీలకు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థలో మన దేశంతో కలసి పోరాడిన దేశాలను కేంద్ర ప్రభుత్వం మోసం చేయడం తప్ప మరొకటి కాదని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ జాతీయ సమన్వయకర్త కెవి బిజు అన్నారు. ఈ నిర్ణయం వలన కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రైతుల ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నారు. అమెరికా, ప్రపంచ బ్యాంకు వత్తిడికి లొంగి ఇలాంటి నిర్ణయాలు తీసుకొనేందుకు తీసుకు వచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి వాటిని తిప్పికొట్టేందుకు రైతాంగాన్ని కదిలించిన సంయుక్త కిసాన్ మోర్చా, ఇండియా కూటమి కూడా కేంద్ర నిర్ణయాన్ని ప్రశ్నించింది. భారత్‌లో టర్కీ కోడి మాంసంపై ప్రస్తుతం ఉన్న 30% దిగుమతి పన్నును 5 శాతానికి తగ్గిస్తారని అమెరికా పార్లమెంటు సభ్యురాలు అమీ క్లోబుచర్ ప్రకటించారు.

తమ కోళ్ల ఉత్పత్తులను మన దేశంలో కుమ్మరించేందుకు అమెరికా చాలా కాలం నుంచి చూస్తోంది. బెదిరింపు, వత్తిడి వంటి అనేక రూపాల్లో అది ప్రయత్నించి చివరికి అనుకున్నది సాధించింది.2007లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న నాటి యుపిఎ ప్రభుత్వం అమెరికా కోళ్ల ఉత్పత్తులపై నిషేధం విధించింది. అది చెల్లదంటూ అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు దాఖలు చేసింది. అమెరికా తన కోళ్ల ఉత్పత్తుల్లో 15 నుంచి 20 శాతం వరకు ఎగుమతులు చేస్తున్నది. 2014లో అమెరికా కేసు గెలిచింది. అధికారానికి వచ్చిన కొత్త రోజులు గనుక మోడీ సర్కార్ ఆ తీర్పును అమలు చేసేందుకు భయపడింది. ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా భారత్ మీద ఆంక్షలను విధింప చేయిస్తామని అమెరికా బెదిరించటంతో కేంద్ర ప్రభుత్వం చికెన్‌లెగ్స్ దిగుమతులకు అనుమతిస్తున్నట్లు 2017లో తెలిపింది.

నిజానికి మన దేశంలో ఉత్పత్తి అవుతున్న చికెన్ మాంసం, గుడ్లు అవసరాలకు మించి ఉండటంతో 201617లోనే రూ. 532 కోట్ల మేరకు వివిధ దేశాలకు ఎగుమతి చేశాము. నరేంద్ర మోడీ రెండవసారి విజయం సాధించిన తరువాత నాటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒకవైపు మోడీని పొగడ్తలు, ఆలింగనాలతో ముంచెత్తుతూనే మరోవైపు మరింత వత్తిడి పెంచాడు. అప్పటి వరకు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తున్న వస్తువుల మీద జిపిఎస్ పేరుతో 600 కోట్ల డాలర్ల మేర ఇస్తున్న దిగుమతి పన్ను రాయితీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. దానికి ప్రతిగా మన దేశం కూడా అమెరికానుంచి దిగుమతి చేసుకుంటున్న యాపిల్స్ వంటి 28 రకాల వస్తువులపై దిగుమతి పన్ను పెంచింది. మన మార్కెట్‌ను మరింతగా తెరవాలని డిమాండ్ చేస్తున్న అమెరికా ఇంతవరకు జిపిఎస్‌ను పునరుద్ధరించలేదు.

ట్రంప్ పోయి బైడెన్ వచ్చినా జరిగిందేమీ లేదు గానీ మన దేశం మాత్రం అమెరికా వస్తువుల మీద విధించిన పన్నులను మోడీ సర్కార్ తాజాగా తగ్గించింది. అమెరికా, చైనా వాణిజ్య పోరుతో మన దేశం లబ్ధి పొందవచ్చని కొందరు ఆశించారు. అది కార్యరూపం దాల్చలేదు.తొలి రోజుల్లో అమెరికా మీద మోడీ సర్కార్ చూపిన పరిమిత ప్రతిఘటన తరువాత నీరుగారింది. ఇప్పుడు పూర్తిగా లొంగిపోయింది. నిజానికి నరేంద్ర మోడీ జూన్ నెలలో అమెరికా వెళ్లినపుడే పన్నుల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు, సెప్టెంబరులో వెల్లడించారు. కోళ్ల పరిశ్రమలో మార్కెట్‌ను మరింత తెరిచారు.రైతాంగ స్పందన చూసిన తరువాత అమెరికా, ఐరోపా, ఇతర దేశాల నుంచి పాల ఉత్పత్తులను అనుమతించి పాడి పరిశ్రమకూ మంగళం పాడేందుకు చూస్తున్నారు.అన్నీ ఒకేసారి చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుంది గనుక దశలవారీ నిర్ణయాలు తీసుకుంటారు.

మన దేశంలో పాల పదార్ధాల ధరల్లో సగానికి దిగుమతి చేసుకున్న వాటిని విక్రయిస్తారని గతంలోనే అనేక మంది చెప్పారు. 2020లో మన దేశంలో పాలపొడి ధర కిలో రూ. 130 నుంచి 150 వరకు ఉండగా 30 శాతం దిగుమతి పన్నుతో సహా అమెరికా నుంచి రూ. 70కే దిగుమతి చేసుకోవచ్చని తేలింది. ఇప్పుడు కూడా ధరల్లో మార్పులు ఉండవచ్చు తప్ప విదేశాలు ఇచ్చే సబ్సిడీలు భారీ ఎత్తున ఉంటాయి. చైనాతో అమెరికా 2018లో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందువలన అమెరికన్లు తమ వస్తువులకు కొత్త మార్కెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అమెరికా వత్తిడిని అడ్డుకొనేందుకు మనసుండాలే గానీ మార్గం దొరక్కపోదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అమెరికాలో వ్యాపించిన బర్డ్ ఫ్లూను పేర్కొంటూ కోళ్ల ఉత్పత్తుల దిగుమతులను నిషేధించింది. నరేంద్ర మోడీ ఆంక్షలను, దిగుమతి పన్నులను సడలిస్తున్న సమయంలో అమెరికాలోని వాణిజ్య పౌల్ట్రీ ఫారాల్లో ఫ్లూ కనిపించింది.

2022 నుంచి ఇప్పటి వరకు ఈ వ్యాధికి అక్కడ 5.88 కోట్ల కోళ్లు, టర్కీ కోళ్లు మరణించినట్లు 2023 అక్టోబరు పదవ తేదీన రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొన్నది. అమెరికాలో అతి పెద్ద గుడ్ల ఉత్పత్తి సంస్థ కాల్ మైన్ ఫుడ్స్ విక్రయించే గుడ్ల ధర గత ఏడాది కాలంలో 48 శాతం పడిపోయింది. సెప్టెంబరు 2 తేదీ నాటికి అంతకు ముందు నాలుగు నెలల్లో అమ్మకాలు 30% పడిపోయినట్లు పేర్కొన్నది. బర్డ్ ఫ్లూ మనుషుల్లో కూడా సులభంగా వ్యాప్తి చెందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ కూడా జూలై నెలలో హెచ్చరికలు జారీ చేశాయి. 2022లో 67 దేశాల్లో వ్యాధి కారణంగా 13 కోట్ల కోళ్లను వధించటం లేదా మరణించినట్లు లెక్కలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు మరో 14 దేశాల్లో వ్యాధి కనిపించింది. అందువలన ఈ కారణంగా కూడా అమెరికా ఉత్పత్తులను అడ్డుకోవచ్చు.

ఎం కోటేశ్వరరావు- 8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News