న్యూఢిల్లీ : తన ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలతో యువత, మహిళలకు సాధికారత సాధ్యమైందని, అభివృద్ధి భారతం వారి కలలను సాకారం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం చెప్పారు. న్యూఢిల్లీలో వార్షిక ఎన్‌సిసి, పిఎం ర్యాలీలో యువజనులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, ‘మీరే అభివృద్ధి భారతం రూపశిల్పులు’ అని అన్నారు. గతంలో మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలకు పరిమితం అయ్యేవారని, కానీ తన ప్రభుత్వం వారికి త్రివిధ సాయుధ దళాలతో సహా వివిధ రంగాలలో అవకాశాలు కల్పించిందని, వారు ప్రతి చోట రాణిస్తున్నారని మోడీ చెప్పారు.
ఈ సంవత్సరం రిపబ్లిక్ దినోత్సవ పరేడ్‌ను వారికి అంకితం చేసినట్లు ప్రధాని తెలిపారు. కేంద్ర భద్రత దళాలలో మహిళల సంఖ్య గడచిన పది సంవత్సరాలలో రెట్టింపు అయిందని ప్రధాని మోడీ చెప్పారు. అటువంటి పంథాను అనుసరించవలసిందిగా రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంటున్నదని, దాని ప్రయోజనాలు యువత సృజనాత్మకతకు ఎక్కువగా దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. ఒక దశాబ్దం క్రితం 2జి, 3జి మౌలిక వసతుల కోసం జనం తిప్పలు పడేవారని, ఇప్పుడు 5జి, ఆప్టికల్ ఫైబర్ ప్రతి గ్రామానికి అందుతున్నాయని మోడీ తెలియజేశారు.