న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13న యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్(యుఎఇ)లోని అబు దాబిలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ(బిఎపిఎస్) అబుదాబిలో నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రారంభించనున్న ప్రధాని మోడీ అంతకు ముందు రోజు దాదాపు 50 వేల మంది ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. యుఎఇలో నిర్మించిన అతిపెద్ద స్వామినారాయణ్ ఆలయాన్ని ప్రారంభించాలని కోరుతూ బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ ప్రధాని మోడీకి ఆహ్వాన పత్రాన్ని అందచేసింది.
ఈ ఆహ్వానానికి ప్రధాని అంగీకరించారని బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. స్వామి ఈశ్వరచరణ్‌దాస్, సవామి బ్రహవిహారిదాస్ సారథ్యంలో బిఎపిఎస్ సంస్థ ప్రతినిధులు ప్రధాని మోడీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకుని ఆహ్వాన పత్రాన్ని అందచేసినట్లు సంస్థ తెలిపింది. వికసిస్తున్న కమలం ఆకారంలో స్వామి నారాయణ్ ఆలయాన్ని అబు దాబిలో బిఎపిఎస్ స్వామి నారాయణ్ సంస్థ నిర్మించింది.