న్యూఢిల్లీ : మంత్రివర్గంలో కీలక మార్పులు నేపథ్యంలో నేడు (జులై 3)న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం జరుగనుంది. ఇక్కడి ప్రగతి మైదాన్‌లో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో కేబినెట్ భేటీ ఏర్పాటు అయింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు, ఈ ఏడాది చివరిలోగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఇటు పార్టీలోనూ , అటు మంత్రి మండలిలోనూ భారీ స్థాయిలో మార్పులు ఉంటాయని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. ఇప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవెంద్ర ఫడ్నవిస్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్న వారిలో కొందరికి రాష్ట్రాలలో లేదా జాతీయ స్థాయిలో పార్టీ పటిష్టతల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఓ వైపు ప్రతిపక్షపార్టీలు ఐక్యత దిశలో వడివడిగా అడుగులు వేస్తున్న దశలో ఇందుకు ప్రతిగా నిర్మాణాత్మక స్పందనకు దిగితీరాల్సి ఉందని పార్టీ నేతలు అమిత్ షా, జెపి నడ్డా ఇటీవలే ప్రధాని మోడీకి వివరించారు. ఎన్‌డిఎ నుంచి కొన్ని ప్రధాన పార్టీలు వైదొలిగిన దశలో ఇప్పుడున్న మిత్రపక్షాలకు తగు గౌరవం కల్పించేందుకు ఆయా పార్టీల నేతలకు కూడా మంత్రి పదవులు ఇచ్చేందుకు వీలుంది. సాధారణంగా మంత్రి మండలి భేటీకి కేబినెట్ స్థాయి హోదా మంత్రులు హాజరవుతారు. కొన్ని సందర్భాలలో స్వతంత్ర హోదాలోని మంత్రులు వస్తారు. సంబంధిత విషయాలపై నిర్ణయాలలో పాలుపంచుకుంటారు. సహాయ మంత్రులు ఈ భేటీకి రావడం జరగదు. అయితే ఇందుకు భిన్నంగా ఈసారి యావత్తూ మంత్రి మండలి కేబినెట్ హోదాలు, స్వతంత్ర, సహాయక మంత్రుల తేడా లేకుండా జరుగుతుందని వెల్లడైంది.
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. ఈ ఏడాది చివరిలోగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కర్నాటకలో ఘన విజయం తరువాత కాంగ్రెస్‌లో ఉత్సాహం నెలకొంది. మోడీకి ప్రతిగా రాహుల్ ప్రధాని అభ్యర్థిగా విపక్షం తరఫున బరిలోకి వచ్చే అవకాశాలు ఉండటంతో పరిస్థితిని బేరీజు వేసుకుని ప్రాంతీయ స్థాయిల్లో బిజెపికి మద్దతు క్రోడీకరించుకునే దిశలో కసరత్తు జరుగుతోంది. ఈ దశలోనే సోమవారం నాటి మంత్రి మండలి సమావేశానికి విశిష్ఠ ప్రాధాన్యత ఏర్పడింది. కాగా ఎన్‌సిపిలో ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న ప్రఫుల్ పటేల్‌కు కూడా కేంద్ర మంత్రి మండలిలో అవకాశం కల్పించడం ద్వారా ఎన్‌సిపిని పూర్తిగా దెబ్బతీయాలని బిజెపి యోచిస్తోందని వెల్లడైంది