దేశంలోనే డిజైన్ చేసి తయారు చేసిన అర్జున్ మార్క్1 ఎ యుద్ధట్యాంక్‌ను చెన్నైలో సైన్యాధ్యక్షుడు ఎంఎం నరవణేకు అందజేసి అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ
చెన్నై: సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అర్జున్ ట్యాంక్ చేరింది.ప్రధాని మోడీ ఆదివారం తమిళనాడు పర్యటనలో భాగంగా అర్జున్ ట్యాంక్‌ను అధికారికంగా ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణెకు అందజేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, దేశీయంగా డిజైన్ చేసి తయారైన మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్ మార్క్ 1ఎను భారత సైన్యానికి అప్పగించడం తనకు చాలా గర్వకారణమని తెలిపారు. మన దేశానికి ప్రధాన ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ తమిళనాడు అని అన్నారు. ఇకపై తమిళనాడు మన దేశానికి యుద్ధ ట్యాంకుల తయారీ కేంద్రం అవుతుందన్నారు. తమిళనాడులో తయారయ్యే యుద్ధ ట్యాంకులు మన దేశ ఉత్తర సరిహద్దుల్లో రక్షణ కల్పిస్తాయన్నారు. ఇది ‘భారత దేశ సమైక్య’ స్ఫూర్తిని వెల్లడిస్తోందన్నారు. రెండేళ్ల క్రితం జమ్మూ, కశ్మీర్‌లోని ఫుల్వామాలో సిఆర్‌పిఎఫ్ వాహనంపై ఉగ్రదాడి జరిగిందని, ఈ దుర్ఘటనలో అమరులైన వారందరికీ నివాళులర్పిస్తున్నాని అన్నారు. మన భద్రతా దళాలు మనకు గర్వకారణమన్నారు. వారి ధైర్య సాహపాలు తరతరాలను ప్రేరేపిస్తాయన్నారు. తేజస్ తర్వాత ఆత్మనిర్భర్ భారత్‌కింద భారత దళాలకు అందిన మరో అతిపెద్ద ఆయుధం ‘అర్జున్ మార్క్1ఎ’ యుద్ధ ట్యాంక్ కావడం విశేషం. వాస్తవానికి సైన్యంలో ఇప్పటికే అర్జున్ (ఎంబిటి) ట్యాంకులు సేవలు అందిస్తున్నాయి. కానీ 71 చిన్న, పెద్ద మార్పులతో అర్జున్ మార్క్ 1ఎ రూపంలో అప్‌డేటెడ్ వెర్షన్‌ను తీసుకు వచ్చారు. దీంతో ఇది ప్రపంచంలో అత్యాధునిక ఆయుధాలతో పోటీ పడేలా సిద్ధమైంది. భవిష్యత్తు యుద్ధ తంత్రాలకు చెందిన వ్యవస్థలు దీనిలో ఉన్నాయి. వీటిని హంటర్ కిల్లర్స్ అని కూడా పిలుస్తారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఇది స్థిరంగా పని చేయగలదు. ఇది దాదాపు 68 టన్నుల బరువుంటుంది.120 ఎంఎం రౌండ్స్ వినియోగించే గన్‌ను దీనికి అమర్చారు.
ఈ ట్యాంక్‌ను డిఆర్‌డిఓ చెన్నై విభాగంలోని కాంబాట్ వెహికిల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (సివిఆర్‌డిఇ) అభివృద్ధి చేసింది. ఆవడిలోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీకి ఇలాంటి 118 ట్యాంకులను తయారు చేయడానికి రూ.8,500 కోట్ల విలువైన ఆర్డర్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్యాంకులో 14 వరకు ప్రధాన మార్పులు ఉన్నాయి. ఈ ట్యాంక్ ఆత్మరక్షణ వ్యవస్థ కూడా చాలా బలంగా ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ట్యాంక్ గన్‌లో లక్షాన్ని ఆటోమేటిగ్గా ట్రాక్ చేసే వ్యవస్థను అమర్చారు. దీంతో వేగంగా కదులుతున్న లక్షాలను కూడా ఇది సులభంగా పేల్చి వేయగలదు. ఈ ట్యాంక్ వేగంగా ప్రయాణిస్తూ కూడా ఇతర లక్షాలను ధ్వంసం చేయగలదు. కంప్యూటర్‌లోని ఇంటిగ్రేటెడ్ ఫైర్ కంట్రోల్ వ్యవస్థ ట్యాంక్ గన్‌ను నియంత్రిస్తుంది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా లక్షాలను సులభంగా గుర్తించగల వ్యవస్థ దీనిలో ఉంది.ఈ ట్యాంక్ ప్రయోగించే తూటాలు (మందుగుండు) కూడా ప్రత్యేకమైనవే. దీని తూటా లక్షాన్ని చేరుకోగానే అక్కడి ఆక్సిజన్‌ను పూర్తిగా వినియోగించుకుని పేలుతుంది. దీంతో పాటు చొచ్చుకు పోయిన తర్వాత విస్ఫోటనం చెందేలా వీటిని తయారు చేశారు.
PM Modi to dedicate Arjun Tank to Nation on Sunday