Sunday, December 29, 2024

సిఎఎ అమృత్ భారత్ రైళ్ల చార్జీలు ప్రియం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒక కిలో మీటర్ నుంచి 50 కిలో మీటర్ల వరకు దూరానికి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణానికి కనీస టిక్కెట్ ధర రూ. 35 అని రైల్వే బోర్డు అన్ని జోన్లకు సమాచారం ఇచ్చింది. రిజర్వేషన్ రుసుము, ఇతర చార్జీలు అందులో చేర్చలేదని బోర్డు తెలియజేసింది. అమృత్ భారత్ రైళ్ల చార్జీల విధానంపై ఒక సర్కులర్‌ను బోర్డు జారీ చేసింది. సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు సంబంధించి దూరం స్లాబ్‌లు, టిక్కెట్ ధరలతో ‘చార్జీల పట్టిక’ను బోర్డు ఆ సర్కులర్‌కు జత చేసింది. మొట్టమొదటి అమృత్ భారత్ రైలులో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ బోగీలు మాత్రమే ఉన్నందున ఎసి బోగీలకు సంబంధించిన చార్జీల పట్టికను రైల్వే మంత్రిత్వశాఖ ఇంకా రూపొందించవలసి ఉందని రైల్వే వర్గాలు సూచించాయి. తొలి అమృత్ భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 30న అయోధ్యలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. A ‘ప్రస్తుతం నడుస్తున్న ఇతర మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని చార్జీలతో ఈ రెండు తరగతుల సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ చార్జీలతో పోలిస్తే అమృత్ భారత్ చార్జీలు 15 నుంచి 17 శాతం అధికం’ అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

‘ఇతర మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒక కిమీ నుంచి 50 కిమీ వరకు దూరానికి సెకండ్ క్లాస్ ప్రయాణానికి కనీస టిక్కెట్ ధర రిజర్వేషన్, ఇతర చార్జీలు మినహాయించి రూ. 30. అంటే అమృత్ భారత్ చార్జీ దాదాపు 17 శాతం అధికం అన్న మాట’ అని ఆయన వివరించారు. రైల్వే బోర్డు జారీ చేసిన సర్కులర్ ప్రకారం, రాయితీ టిక్కెట్లు తిరిగి చెల్లించని ఉచిత కాంప్లిమెంటరీ పాస్‌లతో టిక్కెట్లను ఈ రైళ్లలో అనుమతించబోరు. ‘రైల్వే ఉద్యోగులకు ప్రివిలేజ్ పాస్, పిటిఒ (ప్రివిలేజ్ టిక్కెట్ ఆర్డర్), డ్యూటీ పాస్‌ల అర్హత మెయిల్/ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అర్హతకు సమానంగా ఉంటుంది’ అని ఆ సర్కులర్ సూచించింది. పార్లమెంట్ సభ్యులకు జారీ చేసిన పాస్‌లు, ఎంఎల్‌ఎలు/ ఎంఎల్‌సిలకు జారీ చేసిన రైల్ టిక్కెట్ కూపన్ (టిసిఎస్)లపై టిక్కెట్ల బుకింగ్‌కు, స్వాతంత్య్ర యోధులకు బుకింగ్‌కు అనుమతి ఉంటుంది. అవి పూర్తిగా తిరిగి చెల్లింపునకు వీలు ఉన్నవి కావడమే ఇందుకు కారణం’ అని ఆ సర్కులర్ పేర్కొన్నది. అమృత్ భారత్ రైళ్లను, వాటి చార్జీలను ప్రతిబింబించే విధంగా సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేయవలసిందిగా రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం (సిఆర్‌ఐఎస్)కు రైల్వే బోర్డు విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News