ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రామేశ్వరంలో దేశంలోనే మొట్టమొదటిదైన వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆయన ఇతర ప్రాజెక్టులనూ జాతికి అంకితం చేయనున్నారు. అధికార కార్యక్రమానికి ముందు భారతీయ రైల్వేలు రమణీయమైన నూతన పంబన్ వంతెన ప్రచార వీడియోను ఆవిష్కరించింది. ‘గతాన్ని అనుసంధానిస్తూ, కొత్తదాని ఉత్థానంతో పంబన్ అద్భుత దృశ్యంతో ఠీవిగా నిలుస్తోంది. ఈ రామ నవమికి భారత తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిని తిలకించండి& ఒక్క రోజులో ఆవిష్కరణ’ అని రైల్వే మంత్రిత్వశాఖ ప్రకటించింది. రూ. 550 కోట్ల వ్యయంతో నిర్మించచిన వంతెన ప్రారంభోత్సవానికి ముందు ఈ తీర ప్రాంత పట్టణం భద్రత వలయంలో ఉంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీ కొత్త పంబన్ రైల్వే వంతెనను ప్రారంభించి, రామేశ్వరం తాంబరం (చెన్నై) కొత్త రైలు సర్వీసుకు జెండా ఊపి నాంది పలుకుతారు, వర్టికల్ లిఫ్ట్ స్పాన్ పైకి లేస్తుండగా కోస్ట్ గార్డ్ నౌకను ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు,
ఇది వంతెనకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణకు సూచిక. మోడీ ఆదివారం మధ్యాహ్నం సుమారు 12.45 గంటలకు రామేశ్వరంలోని ప్రముఖ రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి, స్వామివారిని అర్చిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు తమిళనాడులో రూ. 8300 కోట్లు విలువ చేసే వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి,జాతికి అంకితం చేస్తారు. ఆ ప్రాజెక్టుల్లో ఎన్‌హెచ్40లో 28 కిమీ నిడివి గల నాలుగు లేన్‌ల వాలజాపేటరాణిపేట సెక్షన్‌కు శంకుస్థాపన చేయడం, ఎన్‌హెచ్332లో 4 లేన్‌ల 29 కిమీ నిడివిగల విలుప్పురంపుదుచ్చేరి సెక్షన్‌ను, ఎన్‌హెచ్ 32లో 57 కిమీ నిడివి గల పూండియన్‌కుప్పం సత్తనాథపురం సెక్షన్‌ను, ఎన్‌హెచ్36లో 48 కిమీ నిడివి గల చోళపురం తంజావూరు సెక్షన్‌ను జాతికి అంకితం చేస్తారు. అవి అనేక పుణ్య క్షేత్రాలను,పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తాయి, నగరాల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి, వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, రేవులకు త్వరగా చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి, సమీప మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు స్థానిక రైతులకు సాధికారత కల్పిస్తాయి,
స్థానిక తోలు, లఘు పరిశ్రమల ఆర్థిక కార్యకలాపాలను పెంపొందిస్తాయి. ఆ వంతెనకు అత్యంత సాంస్కృతిక ప్రాముఖ్యం ఉంది. రామాయణం ప్రకారం, రామ్ సేతు నిర్మాణాన్ని రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి నుంచి ప్రారంభించారు. రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించే ఆ వంతెన ప్రపంచ వేదికపై భారతీయ ఇంజనీరింగ్ ఘనతకు నిదర్శనంగా నిలుస్తున్నది. రూ. 550 కోట్లకు పైగా వ్యయంతో వంతెన నిర్మించారు. వంతెన నిడివి 2.08 కిలోమీటర్లు. 99 స్పాన్లతో, 17 మీటర్ల ఎత్తుకు లేచే 72.5 మీటర్ల వర్టికల్ లిఫ్ట్ స్పాన్‌తో కూడుకున్నది. దాని వల్ల భారీ నౌకలు సాఫీగా సాగిపోవడానికి,సజావుగా రైలు సర్వీసులు నిర్వహించడానికి వీలు కలుగుతుంది. భావి అవసరాలను దృష్టిలో పెట్టుకుని జంట రైలు మార్గాలు వేశారు. ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకునేలా వంతెన నిర్మాణం జరిగింది. కొత్త పంబన్ వంతెనను రైల్వే మంత్రిత్వశాఖ అధీనంలోని నవరత్న పిఎస్‌యు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పెక్కు సవాళ్లను అధిగమించి నిర్మించింది.