న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు వజ్రోత్సవాన్ని ఆదివారం (జనవరి 28 ) ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. సుప్రీం కోర్టు 75 వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ వజ్రోత్సవంలో పౌర కేంద్రీకృత సమాచారాన్ని, డిజిటల్ సుప్రీం కోర్టు రిపోర్టు (డిజిఎస్‌సిఆర్ ), డిజిటల్ కోర్టు 2.0, కొత్త వెబ్‌సైట్, తదితర సాంకేతిక వినూత్న ఆవిష్కరణలను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఈ ఉత్సవంలో ప్రధాని ప్రసంగిస్తారు. డిజిటల్ సుప్రీం కోర్టు రిపోర్టు (ఎస్‌సిఆర్) లో పౌరులకు ఉచితంగా సుప్రీం కోర్టు తీర్పులు ఎలెక్ట్రానిక్ రూపంలో లభిస్తాయి. డిజిఎస్‌సిఆర్‌లో 1950 నుంచి 36,308 సుప్రీం కోర్టు కేసులు తాలూకు రిపోర్టులు డిజిటల్ ఫార్మేట్‌లో పుస్తక రూపంలో సులువుగా అందుబాటులో ఉంటాయి.
ఇ కోర్టు ప్రాజెక్టులో భాగమైన డిజిటల్ కోర్టు 2.0 అప్లికేషన్‌లో ఎలెక్ట్రానిక్ రూపంలో కోర్టు రికార్డులు జిల్లా కోర్టుల జడ్జీలకు లభిస్తాయి. ఇందులో కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ప్రసంగాలను పాఠ్యరూపంలో నిజసమయ ప్రాతిపదికన తర్జుమా చేయడమౌతుంది. సుప్రీం కోర్టు నూతన వెబ్‌సైట్‌ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లో ద్విభాషాకృతిలో ఉంటుంది. వినియోగదారునికి సులువుగా ఉండేలా దీన్ని తిరిగి డిజైన్ చేశారు. సుప్రీం కోర్టు ఉత్సవ ధర్మాసనం చీఫ్ జస్టిస్ కోర్టులో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు దీన్ని నిర్వహిస్తారు. చీఫ్ జస్టిస్ అధ్యక్షత వహించే ఈ వజ్రోత్సవ కార్యక్రమానికి హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లు, సుప్రీం కోర్టు మాజీ జడ్జీలు పాల్గొంటారు. చీఫ్ జస్టిస్, అటార్నీజనరల్, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసంగిస్తారు.