Wednesday, January 22, 2025

రేపు ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రానున్న కేంద్ర వార్షిక బడ్జెట్ కోసం సలహాలు, అభిప్రాయాలు తీసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే గురువారం(జులై 11) ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశం కానున్నారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మంగళవారం వెల్లడించారు. జులై 23న లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రధానితో గురువారం జరిగే సమావేశంలో ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతోపాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ఇతర సభ్యులు కూడా పాల్గొననున్నారు.

మోడీ 3.0 ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తొలి ప్రధాన ఆర్థిక పత్రంగా బడ్జెట్‌ను పరిగణిస్తున్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ రోడ్ మ్యాప్‌ను వేయగలదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గత నెల పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ సంస్కరణల వేగాన్ని పెంచేందుకు ప్రభుత్వ చారిత్రక చర్యలు చేపట్టగలదని సూచనప్రాయంగా వెల్లడించారు. ప్రభుత్వ విధానాలను, దార్శనికతను కేంద్ర బడ్జెట్ ప్రతిబింబిస్తుందని కూడా ఆమె తెలిపారు.

రానున్న బడ్జెట్‌పై ఇప్పటికే నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఆర్థిక వేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలతో చర్చలు జరిపారు. సామాన్యులకు పన్ను రాయితీలు పెంచాలని, వారిలో కొనుగోలు శక్తిని ప్రోత్సహించాలని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి, ఆర్థిక ప్రగతిని వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని పలువురు ఆర్థిక నిపుణులు కేంద్ర మంత్రిని కోరారు. 2023-24లో దేశ ఆర్థిక రంగంలో ప్రగతి రేటు 8.2 శాతంగా నమోదైంది. కాగా..లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ 2024-25 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News