వచ్చేవారం ప్రదానం
వాషింగ్టన్: వచ్చే వారం జరగనున్న వార్షిక అంతర్జాతీయ ఇంధన సమావేశంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సెరావీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డును స్వీకరిస్తారు. మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు జరిగే సెరావీక్ కాన్ఫరెన్స్-2021లో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా కీలకోపన్యాసం చేస్తారని సమావేశాన్ని నిర్వహిస్తున్న ఐహెచ్ఎస్ మార్కిట్ తెలిపింది.
ఈ సమావేశంలో ఉపన్యసించనున్న ప్రముఖులలో అమెరికా అధ్యక్షునికి పర్యావరణ రంగంలో ప్రత్యేక రాయబారిగా ఉన్న జాన్ కెర్రీ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ అధ్యక్షుడు, బ్రేక్‌థ్రూ ఎనర్జీ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, సౌదీ అరంకో సిఇఓ అమీన్ నాసర్ ఉన్నారు. ప్రపంచ భవిష్యత్ ఇంధన అవసరాలను అధిగమించేందుకు సుస్థిర అభివృద్ధి కోసం ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం సాగిస్తున్న కృషికి గుర్తింపుగా ప్రధాని మోడీకి ఈ అవార్డును అందచేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఐహెచ్ఎస్ మార్కిట్ వైస్ చైర్మన్, కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డేనియల్ యెర్జిన్ తెలిపారు.