ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ మండలం పాలసముద్రం గ్రామంలో భారీయెత్తున నిర్మించిన నేషనల్ అకాడెమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి హాజరవుతారు.
ఆసియా ఖండంలోనే నాసిన్ వంటి కేంద్రం మరొకటి లేదు. దాదాపు 540 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. ఇక్కడినుంచి బెంగళూరు విమానాశ్రయానికి గంటలోగా వెళ్లవచ్చు.
పాలసముద్రం గ్రామ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని 500 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నాసిన్ ను నిర్మించారు. ముస్సోరీలో ఐఏఎస్ లకు, హైదరాబాద్ లో ఐపీఎస్ లకు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా నాసిన్ లో ఐఎర్ఎస్ అధికారులకు శిక్షణకేంద్రం ఏర్పాటు చేశారు. నాసిన్ కు అనుసంధానం చేస్తూ రైల్వే లైన్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ కేంద్రానికి 2015 ఏప్రిల్ లో శంకుస్థాపన జరిగింది.
ప్రధాని మోదీ ఢిల్లీనుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో నాసిన్ కు వస్తారు. మోదీ తిరుగు ప్రయాణంలో లేపాక్షి దుర్గ ఆలయాన్ని, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాలను సందర్శించే వీలు ఉంది.