అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ముఖాముఖీ శనివారం జరుగుతుంది. విలింగ్టన్‌లో జరిగే క్వాడ్ సమ్మిట్ నేపథ్యంలో ఈ ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. ఈ నెల 21 వ తేదీన ప్రధాని మోడీ అమెరికాలో మూడు రోజుల పర్యటన ఆరంభం అవుతుంది. క్వాడ్ సమావేశం నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య కనీసం రెండు కీలక ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయని వెల్లడైంది. ఈ రెండు ఒప్పందాలలో ఒకటి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపిపిఇ)కి సంబంధించింది. రెండోది మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన వ్యవస్థ గురించి అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రా గురువారం విలేకరులకు తెలిపారు. మోడీ అమెరికా పర్యటన గురించి మిశ్రా వివరించారు. బైడెన్‌తో చర్చల దశలో ప్రధాని మోడీ పలు విషయాలను ప్రస్తావిస్తారు.
ప్రత్యేకించి ఉక్రెయిన్ రష్యా యుద్ధం నివారణ దిశలో తీసుకోవల్సిన చర్యలపై దృష్టి సారిస్తారు. ఇటీవల తాను రష్యా అధ్యక్షులు పుతిన్, ఉక్రెయిన్ నేత జెలెన్‌స్కీతో జరిపిన చర్చల వివరాలను బైడెన్‌కు తెలియచేస్తారని మిశ్రా చెప్పారు. సిక్కు వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు భారతదేశ ఇంటలిజెన్స్ సంస్థల సహకారం ఉందనే వాదన నేపథ్యంలో ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత దిగజారాయి. ఈ నేపథ్యంలో బైడెన్‌తో మోడీ సంప్రదింపులు కీలకం కానున్నాయి. ఈ క్వాడ్ భేటీ సందర్భంగానే ప్రధాని మోడీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోనీ అల్బనెస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాను కూడా కలుస్తారు. నాలుగు దేశాలు అమెరికా , ఇండియా , జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన వ్యూహాత్మక భద్రతా విషయాల సంప్రదింపుల సంస్థ క్వాడ్‌గా అవతరించింది.