Thursday, December 19, 2024

4, 5 తేదీల్లో ప్రధాని మోడీ సింగపూర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

భారత్, సింగపూర్ మంత్రుల రౌండ్‌టేబుల్ వ్యవస్థ కింద గుర్తించిన భాగస్వామ్యం కొత్త అంశాలపై ముందుకు సాగుతూ రెండు దేశాలు మరింత పురోగతి సాధించనున్నాయని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) సోమవారం సూచించింది. ప్రధాని నరేంద్ర మోడీ సింగపూర్‌లో జరపనున్న పర్యటనకు ముందు ఎంఇఎ ఆ వ్యాఖ్యలు చేసింది. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానంపై ప్రధాని మోడీ బుధ, గురువారాల్లో (4, 5 తేదీల్లో) ఆ దేశాన్ని సందర్శించనున్నారు. సింగపూర్ సందర్శనకు ముందు ప్రధాని మోడీ మంగళ, బుధవారాల్లో బ్రూనైలో పర్యటించనున్నారు. ఎంఇఎ కార్యదర్శి (తూర్పు)జైదీప్ మజుందార్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ‘రక్షణ రంగంలో సంయుక్త వర్కింగ్ గ్రూప్’ ఏర్పాటు దిశగా భారత్, బ్రూనై సాగుతున్నట్లు తెలియజేశారు.

కాగా, సుమారు ఆరు సంవత్సరాల తరువాత ప్రధాని మోడీ సింగపూర్‌ను సందర్శిస్తున్నారని ఆయన తెలిపారు. ‘సింగపూర్‌లో కొత్త అధినేత బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఈ పర్యటన చోటు చేసుకుంటున్నది. చైతన్యవంతమైన మన ద్వైపాక్షిక సంబంధాల తదుపరి దశకు వేదిక ఏర్పాటుకు ఇదే అనువైన సమయం’ అని మజుందార్ పేర్కొన్నారు. తూర్పు ఆసియా దేశాల్లో సింగపూర్ భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ప్రధాని మోడీ పర్యటన సమయంలో సింగపూర్‌లో సిఇఒలు, ఇతర వాణిజ్య అధినేతలతో భేటీ జరగనున్నది. బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బొల్కియా ఆహ్వానంపై ప్రధాని మోడీ మంగళ, బుధవారాల్లో బ్రూనై దారుస్సలామ్‌ను సందర్శించనున్నారు. ఇది ఆ దేశానికి ఒక భారత ప్రధాని తొలి ద్వైపాక్షిక పర్యటన కానున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News