భారత్ కొత్తగా ప్రకటించిన ‘మహాసాగర్ విధానం’ కింద ప్రాంతీయ సహకారం పెంపుదల, సుస్థిర, సౌభాగ్య ఇండో పసిఫిక్ ప్రాంతం లక్షంతో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వారం అంటే ఏప్రిల్ 3 నుంచి 6 వరకు థాయిలాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారు. పర్యటన మొదటి ఘట్టలో ప్రధాని మోడీ థాయిలాండ్ ఆతిథ్యం వహిస్తున్న ఆరవ బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఏప్రిల్ 3, 4 తేదీల్లో బ్యాంకాక్‌ను సందర్శిస్తారని, అది థాయిలాండ్‌కు ప్రధాని మూడవ పర్యటన అని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ)శుక్రవారం వెల్లడించింది. ప్రధాని మోడీ థాయిలాండ్ నుంచి శ్రీలంక అగ్ర నాయకత్వంతో చర్చల నిమిత్తం మూడు రోజుల పర్యటనపై ఆ దేశానికి వెళతారు.
‘థాయిలాండ్, శ్రీలంకలకు ప్రధాని పర్యటన, ఆరవ బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సదస్సులో ఆయన భాగస్వామ్యం భారత ‘ఇరుగుపొరుగు దేశాలు ప్రథమం’ విధానం, ‘ఏక్ట్ ఈస్ట్’ విధానం, ‘మహాసాగర్ ధ్యేయం’, ఇండో పసిఫిక్ లక్షం పట్ల దేశం నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది’ అని ఎంఇఎ తెలియజేసింది. ఇటీవల తన మారిషస్ పర్యటన సమయంలో గ్లోబల్ సౌత్‌తో భారత్ భాగస్వామ్యం కోసం ‘మహాసాగర్’ లేదా ‘ప్రాంతాల వ్యాప్తంగా భద్రత, వృద్ధికి సంబంధించి పరస్పర, సంపూర్ణ పురోగమనం’ ధ్యేయాన్ని మోడీ ప్రకటించారు. బిమ్‌స్టెక్ (బహుళ రంగ సాంకేతిక, ఆర్థిక సహకారం కోసం బంగాళాఖాతం చొరవ) కూటమిలో భారత్, థాయిలాండ్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
బ్యాంకాక్ శిఖరాగ్ర సదస్సులో బిమ్‌స్టెక్ నేతలు సభ్య దేశాల మధ్య సహకారంలో మరింత వృద్ధికి మార్గాలపై చర్చించవచ్చు. ‘బిమ్‌స్టెక్ వ్యవస్థ లోపల సహకారాన్ని వేగవంతం చేసేందుకు వివిధ సంస్థాగత, స్థాయి పెంపుదల చర్యలను కూడా నేతలు చర్చించవచ్చు’ అని ఎంఇఎ ఒక ప్రకటనలో తెలియజేసింది. ద్వైపాక్షిక సంబంధాల పరంగా మోడీ ఏప్రిల్ 3న థాయిలాండ్ ప్రధానితో సమావేశం కానున్నారు. ఇద్దరు ప్రధానులు ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించవచ్చునని, రెండు దేశాల మధ్య భావి భాగస్వామ్యానికి మార్గాన్ని రూపొందించవచ్చునని ఎంఇఎ తెలిపింద. కొలంబోలో మోడీ శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకతో చర్చలు జరుపుతారు. మోడీ కొలంబోలో సీనియర్ ప్రముఖులతోను, రాజకీయ నాయకులతోను కూడా భేటీ కాగలరు.