ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల21న పోలెండ్‌ను, రెండు రోజుల తరువాత 23న యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్‌ను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) సోమవారం ప్రకటించింది. ఎంఇఎలో పశ్చిమ విభాగం కార్యదర్శి తన్మయ లాల్ ఈ ప్రకటన చేశారు. భారత ప్రధాని ఒకరు 45 ఏళ్లలో పోలెండ్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ పర్యటన చోటు చేసుకుంటున్నది. కాగా, ఒక భారత ప్రధాని ఉక్రెయిన్‌ను సందర్శించడం 30 పైచిలుకు సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. ‘నేతల మధ్య ఇటీవలి ఉన్నత స్థాయి చర్చలను ఈ పర్యటన ముందుకు తీసుకువెళుతుంది’ అని తన్మయ లాల్ సూచించారు. పోలెండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఆహ్వానాలను పురస్కరించుకుని ప్రధాని మోడీ ఆ రెండు దేశాలను సందర్శిస్తున్నారు.
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను ఖండించకుండా భారత్ సంయమనం పాటించినందున ఉక్రెయిన్‌లో ప్రధాని మోడీ పర్యటన ప్రభావం ఏమాత్రం ఉంటుందో వేచి చూడవలసి ఉంటుంది. ప్రత్యేక సైనిక చర్యగా మాస్కో అభివర్ణించిన ఆ దురాక్రమణ గురించి ప్రధాని మోడీ బాహాటంగా మాట్లాడారు. ఆ వివాదం పరిష్కారానికి పరస్పర చర్చలు అవసరమని ఆయన సూచించారు. అయితే, ఆ వివాదంపై భారత విస్పష్ట వైఖరి పాశ్చాత్య దేశాల విమర్శలకు గురైంది. చైనా ప్రభావం తగ్గించేందుకు న్యూఢిల్లీతో తన సంబంధాల పటిష్ఠతకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సన్నిహిత సంబంధాల పట్ల అమెరికా విచారం వెలిబుచ్చింది. మరొక వైపు పాశ్చాత్య దేశాలతోను, తన దీర్ఘకాలిక మిత్ర దేశం రష్యాతోను సంబంధాలు కొనసాగించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.