న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్, అమెరికాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు రెండు దేశాల్లో ఆయ న షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రధానమంత్రి పర్యటన వివరాలను శుక్రవారంనాడు వెల్లడించింది. ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మేక్రాన్‌తో భేటీ కానున్నారు. మేక్రాన్‌తో కలిసి కృత్రిమ మేథపై యాక్షన్ సమ్మిట్‌లో పాల్గొంటారని కేంద్ర విదేశాం గ శాఖ కార్యదర్శి మిస్త్రీ తెలిపారు. ఆ సమ్మిట్‌కు మేక్రాన్‌తో కలిసి మోడీ అధ్యక్షత వహించనున్నారని వివరించారు.
అంతర్జాతయ థర్మో న్యూక్లియ ర్ రియాక్టర్‌ను మోడీ సందర్శించనున్నారని, థర్మో న్యూక్లియర్‌తో భారత్ ఇప్పటికే
భాగస్వామిగా ఉందని ఆయన గుర్తు చేశారు. ఇక మే 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు దేశాధినేతలు చర్చించనున్నారు. వివిధ దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో ఇరువురి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అదే విధంగా భారత్‌కు అక్రమ వలసదారుల తరలింపు విధానం కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అక్రమ వలసదారుల జాబితాలో 487 మంది భారతీయులు…
అమెరికా నుంచి బహిష్కరణ జాబితాలో 487 మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు. సంకెళ్లు వేసి వలసదారులను తరలిస్తున్న తీరుపై అమెరికాకు తమ నిరసన తెలియజేసినట్లు మిస్త్రీ వివరించారు. అక్రమంగా అమెరికా వెళ్లిన వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి చర్యలు చేపడ్తున్నామన్నారు.