Wednesday, January 8, 2025

నేడు విశాఖకు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పర్యటన ఏర్పాట్లపై సీఎస్ కె.విజయానంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటనలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదటి సారి ప్రధాని విశాఖపట్నం వస్తున్నారు. బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకోనున్న నరేంద్ర మోడీకి ఎయిర్‌పోర్టులో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. ఈ నేపథ్యంలో మోడీతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షోలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా రోడ్డు షోలో పాల్గొనేందుకు పెద్దఎత్తున వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధులు రానున్నందున వారి వాహనాల పార్కింగ్ కు అవసరమైన చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలక్టర్,పోలీస్ కమీషనర్,మున్సిపల్ కమీషనర్ తదితర అధికారులను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.

సాయంత్రం వేళలో ప్రధాని పర్యటన జరగనున్నందున రోడ్డు షో, సభా వేదిక,వివిధ పార్కింగ్ స్థలాల్లో తగిన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.సభా వేదిక,పార్కింగ్ ప్రాంతాల్లో తాగునీరు,తాత్కాలిక మరుగుదొడ్లు,ఇతర సౌకర్యాలను కల్పించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.ప్రధాని పర్యటనకు విశాఖపట్నం సహా పరిసర అనకాపల్లి,విజయనగరం,శ్రీకాకుళం తదితర జిల్లాల నుండి ప్రజలను బస్సులు,ఇతర వాహనాల్లో తరలించనున్నందున వారిని సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలక్టర్లు,ఎస్పిలను సిఎస్ ఆదేశించారు.సమావేశానికి వచ్చే వారికి తాగునీరు, అల్పాహారం,భోజన వసతి వంటి ఏర్పాట్లలో ఎటువంటి విమర్శలకు తావీయకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలక్టర్ సహా పరిసర జిల్లాల కలక్టర్లను ఆదేశించారు.

వాహనాల ట్రాఫిక్,పార్కింగ్ వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని డిజిపి,విశాఖ పోలీస్ కమీషనర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్న డిజిపి ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఎస్పిజి సమన్వయంతో పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. విశాఖపట్నం జిల్లా కలక్టర్ హరీంద్ర ప్రసాద్ వర్చువల్ గా పాల్గొని మాట్లాడుతూ విశాఖనగరంలో ప్రధాని రోడ్డు షోలో సుమారు 80వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.అదే విధంగా సభలో లక్షా 80 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లనీ దాదాపు పూర్తి కావచ్చాయని చెప్పారు. విశాఖ పోలీస్ కమీషనర్ ఎస్.బాగ్చి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వివిధ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్)ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్,ఇంటిలిజెన్స్ ఐజి పిహెచ్డి రామకృష్ణ పాల్గొనగా వర్చువల్ పలు శాఖల కార్యదర్శులు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా రోడ్ షో : విశాఖలో రోడ్డు మార్గంలో సిరిపురం కూడలి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో జరగనుంది. ఈ ముగ్గురు కలిసి నిర్వహించే రోడ్ షో ప్రధాని పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రోడ్ షో అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనుంది. ఈ క్రమంలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన : ప్రధాని నరేంద్ర మోడీ పలు ప్రాజెక్టులకు, రైల్వే జోన్ ఏర్పాటుకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఎన్‌టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్, నక్కపల్లిలో 2001.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.1876.66 కోట్లతో ఏర్పాటు చేసే బల్కు డ్రగ్ పార్కును మోడీ వర్చువల్‌గా శంఖుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం 4.15 గంటలకు ప్రధాన మంత్రి విశాఖ చేరుకుంటారు. ఆ తర్వాత రోడ్డు షో నిర్వహిస్తారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళశాల మైదానం నుంచి వర్చువల్‌గా శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం విశాఖ నుంచి భువనేశ్వర్ బయలుదేరుతారు.

పలు శంఖుస్థాపనలు : మోడీ వర్చువల్‌గా విశాఖ రైల్వే జోన్ ప్రధాన కేంద్రం, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీ నగర్, గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ల డబులింగ్ పనులకు శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే 16వ జాతీయ రహదారిలో చిలకలూరి పేట 6 లైన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేయనున్నారు. వివిధ జాతీయ రహదార్లు, రైల్వే లైన్లను కూడా ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించనన్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు : నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధిచిన ఏర్పాట్లను మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, తదితరులు పరిశీలించారు. సిరిపురం కూడలి నుంచి ఆంధ్రా యూనివర్సిటీ గేటు వరకు రోడ్ షో స్థలాన్ని పరిశీలించారు. సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుమారు 3 లక్షల మంది హాజరవుతారని అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News