కొండ చరియలు విరిగిపడడంతో అపార ప్రాణ నష్టాన్ని చవిచూసిన వయనాడ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించి సహాయ పునరావాస చర్యలను సమీక్షించడంతోపాటు బాధితులను పరామర్శించనున్నారు.శనివారం ఉదయం 11 గంటలకు కన్నూర్ చేరుకోనున్న ప్రధాని మోడీ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి వయనాడ్ ప్రాంతాన్ని పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. సహాయ శిభిరాన్ని, ఆసుపత్రిని సందర్శించి బాధితులను కలుసుకుని వారితో మాట్లాడతారని వారు చెప్పారు.
అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. వయనాడ్ విపత్తు జరిగిన తీరు, కొనసాగుతున్న సహాయక చర్యల గురించి అధికారులు ప్రధానికి వివరిస్తారు. జులై 30న వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడి గ్రామాలకు గ్రామాలు మట్టి దిబ్బల కింద విథిలమైన ఘటనలో వప్పటి వరకు 228 మంది మరణించినట్లు అధికారికంగా గుర్తించారు. అనేక మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.