న్యూఢిల్లీ : దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్థంతి సందర్భంగా బుధవారం ఇక్కడ ఆయన స్మారకస్థలి సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ , ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా , ఎన్‌డిఎ మిత్రపక్ష నేతలు పలువురు తరలివచ్చారు. తమ నేతకు శ్రద్ధాంజలి ఘటించారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమ ప్రియతమ నేతను సంస్మరించుకున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తమ పూర్వపు నేత వాజ్‌పేయి స్మారక స్థలి వద్ద పుష్ఫగుచ్చాలుంచారు.
ఆయనను తాను ఎప్పటికీ మర్చిపోలేనని, ఆయన హయాంలోనే తాను పలు పదవులు నిర్వర్తించానని గుర్తు తెచ్చుకున్నారు. సమాధి స్థలివద్దకు నితీశ్ రావడంపై బిజెపి నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన మార్గం ఎటు తేల్చుకోవాలన్నారు. ఈ స్థలి వద్దనే బిజెపి నేతలు కొందరు స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లోనూ బిజెపిదే గెలుపు, మోడీనే ప్రధాని అని చెప్పారు.