భీమవరం: తెలుగు వీరుడు, మన్యం జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు యావత్ భారతావనికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అల్లూరి జయంత్యుత్సవాల సందర్భంగా ఆయన పుట్టిన నేలపై మనమంతా కలుసుకోవడం అదృష్టమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. సభా వేదిక పై నుంచే ఆయన వర్చువల్‌గా అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత అల్లూరి కుటుంబ సభ్యులను మోడీ సన్మానించారు. అల్లూరి సీతారామరాజు వెన్నంటే ఉండిన మల్లు దొర మనుమడు బోడి దొరను కూడా ప్రధాని ఈ సందర్భంగా సన్మానించారు. ఆ తర్వాత స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి కుమార్తె పసల కృష్ణభారతికి మోడీ పాదాభివందనం చేశారు. మోడీ తన ప్రసంగాన్ని తెలుగులోనే మొదలెట్టారు. ‘తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా..’ అని గీతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మనం స్వాతంత్య్రంకు సంబంధించిన అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్నామని కూడా ఆయన తెలిపారు. అల్లూర జీవన ప్రస్థానం మనందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి…వీరభూమి అని కొనియాడారు. అలాంటి పుణ్యభూమికి రావడం తన అదృష్టం అన్నారు. అల్లూరి సీతారామ రాజు ఆదివాసీల శౌర్యం, ధైర్యానికి ప్రతీక అని చెప్పుకొచ్చారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్తే ఎవరూ మనల్ని ఆపలేరన్నారు. అల్లూరి స్మారక మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.