ఎందరో మహానుభావులను విస్మరించిన గత ప్రభుత్వం
భారత స్ఫూర్తిని
పునరుద్ధరించే లక్షంతోనే
అజాదీకా అమృత్
మహోత్సవాల నిర్వహణ
ఇండియా గేట్ వద్ద నేతాజీ
హోలోగ్రామ్ విగ్రహాన్ని
ఆవిష్కరిస్తూ ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత దేశ సంస్కృతి, విలువలను పరిరక్షించడానికి బదులు ఎందరో మహానుభావుల త్యాగాలు, సేవలను తక్కువ చేసి చూ పించడానికి గత ప్రభుత్వం ఎంతో ప్రయత్నించిందని, గ తంలో చేసిన తప్పులను ఇప్పుడు తాము సరిదిద్దుతున్నామని దీన్ని ఎవరూ ఆపలేరని ప్రధాని మోడీ ఆదివారం పరోక్షంగా కాంగ్రెస్‌ను దృష్టిలో పెట్టుకుని విరుచుకు పడ్డారు. భారత దేశ గుర్తింపును, స్ఫూర్తిని పునరుద్ధరించాలన్న లక్షం తోనే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. నేతాజీ సు భాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఇండి యా గేట్ వద్ద ఆదివారం నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. 2047లో స్వాతంత్య్ర శతవార్షికోత్సవం జరగనుందని, దాని కన్నా ముందుగానే నవభారత నిర్మాణ లక్షాన్ని సాధిస్తామని, ప్రపంచంలో ఏశక్తి దీన్ని అడ్డుకోలేదని ఆయన పేర్కొన్నారు. నేతాజీ ఆశయాలైన చేయగలం, చేస్తాం అనే ధైర్యసాహసాలతో ప్రతివా రూ స్ఫూర్తి పొందాలని ప్రధాని పిలుపునిచ్చారు.
భారత స్వాతంత్య్ర పోరాటం లక్షలాది మంది బలిదానమని, కానీ ఆ చరిత్రను పరిమితం చేయడానికి ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. కార్యక్రమంలో 2019, 2020, 2021,2022 సంవత్సరాలకు గాను సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ కు సంబంధించి మొత్తం ఏడు అవార్డులను ప్రధాని బహూకరించారు. గతంలో విపత్తు నిర్వహణ అనేది వ్యవసాయం కింద ఉండేదని, కానీ తమ ప్రభుత్వం ఎన్డీఆర్‌ఎఫ్‌ను మరింత పటిష్ఠం చేసిందని గుర్తు చేశారు. అనేక అంతర్జాతీయ సంస్థలు విపత్తు నిర్వహణ సెక్టార్‌ను చూసి ప్రశంసలు కురిపించాయని పేర్కొన్నారు. విగ్రహం పూర్తయ్యేవరకే ఈ హోలోగ్రామ్ ఉంటుందని, విగ్రహం పూర్తయిన తరువాత హోలోగ్రామ్ స్థానంలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పారు. ఈ విగ్ర హం కేవలం కర్తవ్యాలను మాత్రమే తెలియచేయకుండా భావి తరాలకు నిరంతరాయంగా స్ఫూర్తిని అందిస్తుందని పేర్కొన్నారు. స్వేచ్ఛాభారతంపై నేతాజీ నమ్మకం కలిగించారని చెప్పారు. ఈ హోలోగ్రామ్ విగ్రహం 28 అడుగుల ఎత్తున, 6 అడుగుల వెడల్పులో నిర్మాణమైంది. ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేతాజీకి నివాళులు అర్పించారు.