Monday, December 23, 2024

అమెరికాతో గాఢాను బంధం

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక అమెరికా పర్యటనతో భారత బంధం బలోపేతమైంది. ఇది స్పష్టంగా కనిపిస్తున్న అపూర్వమైన ఫలితం. చైనాతో ఉద్రిక్తతలను తగ్గించుకోడానికి తన విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ను బీజింగ్‌కు పంపించిన తర్వాత భారత ప్రధానికి స్వదేశంలో ఘన స్వాగత సత్కారాలు చేయడం అమెరికా చాకచక్యానికి నిదర్శనం. వాస్తవానికి అమెరికా సమస్యలన్నీ చైనాతో ముడిపడి వున్నాయి. వాటిని తనకు అనుకూలంగా విప్పుకొనే క్రమంలో దానికి ఇండియా సహకారం ఎంతో అవసరం. ప్రధాని మోడీతో గురువారం నాడు పంచుకొన్న వేదిక మీది నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ భారత, అమెరికా బంధం 21వ శతాబ్దిలో సాటిలేనిదని అన్నారు. భారత సహకారంతోనే స్వేచ్ఛాయుతమైన, భద్రతతో కూడిన పసిఫిక్ జలాలకు తోడ్పడే క్వాడ్ ఒప్పందాన్ని ఖరారు చేసుకోగలిగామని బైడెన్ అన్నారు.

ఆయన తన ప్రసంగంలో చైనాతో వైరం నేపథ్యంలో ఇండియా అవసరం అనితరమైనదని చాటుకొన్నారు. రష్యా నుంచి కూడా ఇండియాను దూరం చేయాలని, ఉక్రెయిన్ యుద్ధ సందర్భంగా స్పష్టమైన రష్యా వ్యతిరేక వైఖరిని భారత్ తీసుకొనేలా చేయాలని అమెరికా కోరుకొంటున్నది. అలాగే ఇంత వరకు రష్యా నుంచి అధిక కిమ్మత్తు ఆయుధాలను కొనుగోలు చేస్తున్న ఇండియా ఇక ముందు ఈ విషయంలో తనపైనే ఎక్కువగా ఆధారపడేటట్టు చేసుకోవాలని కూడా అమెరికా ఆశిస్తున్నది. ఇందుకు నాందీగా ఈసారి మోడీ పర్యటనలో భారత, అమెరికాల మధ్య అనేక రక్షణ ఒప్పందాలు కుదిరాయి. సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, టెలీకమ్యూనికేషన్స్, అంతరిక్ష సహకారం వంటి అంశాలపై సన్నిహిత సహకారానికి సంబంధించిన ఈ ఒప్పందాలు ఒకేసారి కుదరడం అపూర్వమైన విషయమే.

జెట్ ఇంజిన్లు, యుద్ధావసర డ్రోన్లు కూడా అమెరికా నుంచి పొందడానికి ఒప్పందం కుదిరింది. మన వైమానికి దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానాల కోసం అమెరికన్ జనరల్ ఇంజినీరింగ్ (జిఇ) ఏరో స్పేస్ మన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హాల్) తో కలిసి ఫైటర్ జెట్ ఇంజిన్లు తయారు చేయబోతున్నది. జిఇ, హాల్ కలిసి అమెరికన్ ఎఫ్ 414 ఇంజిన్లను కూడా ఇండియాలో తయారు చేయబోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అమెరికా ప్రభుత్వం అక్కడి పార్లమెంటు నుంచి అనుమతి పొందవలసి వుంది. అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీస్ సంస్థ రెండు దశల్లో గుజరాత్‌లో సెమీకండక్టర్ల కూర్పు కర్మాగారాన్ని నెలకొల్పనున్నది. 2024 ఆఖరు కల్లా పని ప్రారంభించనున్న ఈ కర్మాగారంలో 5000 మందికి ప్రత్యక్ష కొలువులు లభిస్తాయని అనుకొంటున్నారు. దీని పెట్టుబడి 800 మిలియన్ డాలర్లు.

ఇంకా అప్లయిడ్ మెటీరియల్స్ అనే సంస్థ కూడా వచ్చే ఐదేళ్ళలో బెంగళూరులో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నది. అమెరికా నుంచి మన ఎయిర్ ఇండియా 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయనున్నది. దీని వల్ల అమెరికాలోని 44 రాష్ట్రాల్లో 10 లక్షల ఉద్యోగాలు సమకూరుతాయని ప్రెసిడెంట్ బైడెన్ స్వయంగా ప్రకటించారు. ఇలా తెలివైన వారెవరూ ఏ ప్రయోజనం లేకుండా ఏటిలో దూకరనే సామెత చందంగా, అటు చైనాతో ఘర్షణ తలెత్తితే తన వెంట ఇండియా వుండేలా చేసుకోడానికి ఇటు రక్షణ ఒప్పందాల ద్వారా దండిగా డబ్బు, ఉద్యోగాలు చేసుకోడానికి అమెరికా మోడీ పర్యటనను విశేషంగా ఉపయోగించుకొన్నదని బోధపడుతున్నది. మోడీ కూడా గుజరాత్‌కు నమ్మకమైన పెట్టుబడులు తెచ్చుకోడానికి ఈ పర్యటనను వినియోగించుకొన్నారు.

ఈ పర్యటనలో మోడీ అనేక మంది ప్రముఖ అమెరికన్ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. మైక్రో టెక్నాలజీ సిఇఒ సంజయ్ మెహ్రోత్రా, అప్లయిడ్ మెటీరియల్స్ సిఇఒ గ్యారీ ఇ డికెర్సన్ మున్నగు వారు అందులో వున్నారు. ట్విట్టర్ సిఇఒ ఎలాన్ మస్క్ తో కూడా ఆయన సమావేశమయ్యారు. ఇంత పానకంలోనూ చేదు బిందువులు కూడా లేకపోలేదు. భారత దేశంలో మైనారిటీల పట్ల వివక్ష గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన హెచ్చరికకు ఎంతో ప్రాధాన్యమున్నది. మత, జాతిపరమైన మైనారిటీల హక్కులను కాపాడకపోతే భారత దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం తలెత్తుతుందని ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని బైడెన్ ప్రభుత్వం ప్రధాని మోడీతో నిజాయితీగా చర్చించాలని సూచించారు.

భారత దేశంలో మతపరమైన అసహనం పెరిగిపోయి రాజకీయ స్వేచ్ఛలకు హాని కలుగుతున్న విషయాన్ని మీడియా స్వేచ్ఛ, మానవ హక్కులు దెబ్బతింటున్న సంగతిని ప్రధాని మోడీతో ప్రస్తావించాలని 75 మంది అమెరికా పార్లమెంటు సభులు ప్రెసిడెంట్ బైడెన్‌ను కోరారు. అమెరికా పార్లమెంటులో ప్రధాని మోడీ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు ఇద్దరు అమెరికా ప్రతినిధుల సభ్యులు ప్రకటించారు. ఇది నాణేనికి రెండో వైపు. ఈ చేదు నిజాలను పక్కనపెట్టి బైడెన్, మోడీ ఇద్దరూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో తాము గొప్పంటే తాము గొప్ప అని ప్రగల్భాలు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News