రాష్ట్రాల సిఎంలకు ప్రధాని మోడీ వివరణ, ముందు 3 కోట్ల మంది కొవిడ్ వారియర్స్‌కు
కొద్ది నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్, అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం
విజయవంతం చేయాలని పిలుపు, రాజకీయాలకు అతీతంగా వైరస్ అంతం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కరోనాపై పోరు సాగిస్తున్న 3 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కొవిడ్ టీకా పంపిణికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సోమవారం వెల్లడించారు. రాష్ట్రాలపై ఈ విషయంలో ఒక్కపైసా భారం పడదని తెలిపారు. కరోనా కోరల నుంచి దేశాన్ని విముక్తం చేసే దిశలో రెండు కీలకమైన టీకాల పంపిణి కార్యక్రమం దేశవ్యాప్తంగా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ దశలో వ్యాక్సిన్ పంపిణీ సన్నాహాలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్నారు. మొదటి దశలో కొవిడ్ వారియర్స్‌కు టీకాలు వేస్తారు. దీనికి అయ్యే ఖర్చు కేంద్రం నుంచే లభిస్తుందని స్పష్టం చేశారు.ఈ కేటగిరిలోకి 3 కోట్ల మంది వస్తారు. అనునిత్యం క్షేత్రస్థాయిలో ఉంటూ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది, డాక్టర్లు, పారిశుద్ధ పనివారు. పోలీసు సిబ్బందిని ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వ్యవహరిస్తున్నారు. టీకాల పంపిణీలో వీరికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. తొలి దశలో ఈ తొలి దశలో 3 కోట్ల మంది ఈ కేటగిరిలోని వారికి టీకా వేయడం జరుగుతుందని, దీనికి సంబంధించిన ఖర్చు విషయంలో రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ వ్యయాన్ని అంతటిని కేంద్రమే భరిస్తుందని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే కొద్ది నెలల కాలంలోమొత్తం 30 కోట్ల మందికి టీకా పంపిణీ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన సాగుతుంది. మూడు కోట్ల టీకాల పంపిణీ తరువాత తాను మరోసారి సిఎంలతో పరిస్థితిని సమీక్షిస్తానని ప్రధాని వివరించారు. తొలిదశలో ప్రైవేటు లేదా ప్రభుత్వ రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు టీకాలు వేస్తారు. వ్యాక్సిన్ పంపిణీ తొలి దశలో ప్రజా ప్రతినిధులకు అవకాశం ఉండబోదన్నారు. రాజకీయ నాయకులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోరని తెలిపిన ప్రధాని ఇదంతా కూడా రాజకీయాలకు అతీతంగా కేవలం వైరస్ అంతం ప్రధానంగా సాగుతుందని తెలిపారు.
రెండో దశలో 50 ఏళ్లు పైబడ్డ వారికి
ఇక రెండో దశలో 50 ఏళ్లు పైబడ్డ వారికి, తీవ్ర అనారోగ్య సమస్యలతో బధపడుతున్న 50 ఏళ్లు లోపలివారిని ప్రాధాన్యతా బృందంగా గుర్తించి వారికి టీకాలు పంపిణీ చేస్తారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ కేవలం రెండున్నర కోట్ల మంది టీకాలు పొందారు. జులై నాటికి దేశంలో 30 కోట్ల మందికి టీకా పంపిణీ చేపట్టాలనేదే కేంద్రం సంకల్పం అని తెలిపారు. ఈ విధంగా ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని అత్యంత సామూహిక భారీ స్థాయి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం అని , దేశానికి ఉన్న అపార మానవ వనరులు, సామూహిక ప్రక్రియల నిర్వహణలో ఉన్న అనుభవం , సమర్థతలను ఆసరాగా చేసుకుని ఈ విషయంలో ముందుకు వెళ్లుతామని, ఈ ప్రక్రియలో రాష్ట్రాల నుంచి సరైన సహకారం అందించేలా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఉన్నతాధికారులపై ఉందని ప్రధాని తెలిపారు.
సైంటిస్టులదే కీలక నిర్ణయాధికారం
శాస్త్రవేత్తల నుంచి తగు సలహాలు, వ్యాక్సిన్ల సమర్థతను పూర్తిగా ఖరారు చేసుకున్న తరువాతనే వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. కరోనా విముక్త దేశంగా భారత్ నిలవాలనేదే సంకల్పం అన్నారు. దీనికి బలం అవసరం అన్నారు. ఇప్పటికే రెండు స్వదేశీ టీకాలకు అనుమతిని ఇచ్చారు. మరో నాలుగు వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వ్యాక్సినేషన్ అత్యంత కీలక ఘట్టం అని, దీనికి సంబంధించి వాస్తవిక నిర్థారణ ప్రక్రియ అవసరం అని, సంబంధిత రియల్ టైం డేటా కీలకం అన్నారు. టీకా తీసుకున్న ప్రతి ఒక్కరిలో దీని పనితీరు ప్రతికూలత, అనుకూలత గురించి డిజిటల్ సర్టిఫికేషన్ అవసరం అన్నారు. దీనితోనే రెండో డోసు ఇచ్చే ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు. వ్యాక్సిన్ పౌర స్థాయికి వెళ్లుతుంది కాబట్టి అన్నింటికి మించిన సహకారం పౌరులు, వివిధ ప్రజా సంస్థల నుంచే అందాల్సి ఉంటుందన్నారు.
వదంతులు వ్యాప్తి కరోనా కన్నా డేంజర్
టీకాల పంపిణీకి సంబంధించి ఎటువంటి వదంతులు వ్యాపించకుండా క్షేత్రస్థాయిలో తగు చర్యలు తీసుకోవల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందని, అవసరం అయిన వారందరికి క్రమపద్థతిలో వ్యాక్సిన్ అందుతుందని, ఈ దశలో దీని గురించి రాష్ట్రాలు అన్ని వివరాలతో సమాచారం అందించాల్సి ఉంటుందన్నారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల సమర్థతను అన్ని స్థాయిలలో పరిశీలించి, శాస్త్రీయంగా పరీక్షించి నిపుణుల సమగ్ర పర్యవేక్షణల నడుమనే టీకా పంపిణీ జరుగుతుందని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ నెల 16న ఆరంభం అవుతుంది. రెండు లక్షాలు ఉన్నాయని ఇందులో మొదటిది మూడు కోట్ల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం, వచ్చే కొద్ది నెలల్లో 30 కోట్ల మందికి టీకాలు చేరేలా చేయడం రెండోదని తెలిపారు.
PM Modi Video Conference with All CMs on Vaccine