Tuesday, September 17, 2024

ఎన్నో కొత్త పాఠాలు

- Advertisement -
- Advertisement -

PM Modi

 

స్వావలంబన, ఆత్మస్థైర్యం నేర్పిన కరోనా
బాగా పారిన ‘దో గజ్‌కీ దూర్’
కరోనాతో గ్రామీణ జనం పోరు
గ్రామ సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ

న్యూఢిలీ: కరోనాను ఎదుర్కొవడంలో గ్రామీణ భారతం సమున్నత రీతిలో వ్యవహరించిందని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. చుట్టుముట్టిన మహమ్మారితో తలపడటం లో ప్రజల దృఢదీక్ష ఎనలేనిదని అన్నారు. భారతదేశం స్వ యం సమృద్థం కావాలనే విషయాన్ని ఈ దశ మనకు మరోసారి గుర్తు చేసిందన్నారు. శుక్రవారం పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా సర్పంచ్‌లు, గ్రామ పంచాయతీల అధ్యక్షులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో గ్రామీణ జనం తమదైన రీతిలో దో గజ్ కీ దూర్ (రెండు గజాల దూరం) మంత్రాన్ని పఠించి, పద్థతి ప్రకారం పాటించారు. ఈ విధంగా వారు తమదైన రీతిలో సామాజిక లేదా భౌతిక దూరాన్ని నిర్వచించి చూపారని ప్రధాని కితాబు ఇచ్చారు. దూసుకువచ్చిన కరోనా మనకు పలు సవాళ్లను తెచ్చిపెట్టింది.ఇదే క్రమంలో ఇక ముందు మనం ఏమి చేయాలనేది నేర్పింది? మనం చేరుకోవల్సిన స్థానాలను మనకు గుర్తు చేసిందని ప్రధాని దేశంలోని సర్పంచ్‌లతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు.

ఇంటికి కట్టుబడి ఉండాల్సిన సమయంలో మన నైపుణ్యాలు, మన విజ్ఞానం కాలపరీక్షకు నిలిచినట్లు అయిందని ఈ క్రమంలో మనిషిలోని విలువలు తెలిసివచ్చాయన్నారు. ఇక దేశంలోని గ్రామాలు ఈ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొవడంలో ఉదాత్త పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రజలు ఏదీ చెప్పినా కార్యాచరణనే ఉంటుంది. ఈ మహమ్మారికి సామాజిక దూరం సరై న విరుగుడు అని తెలియగానే దీనిని తమదైన రీతిలో పట్టుదలతో పాటించి చూపారని అన్నారు. దో గజ్ కీ దూర్ మంత్రం సామాన్యమైన విషయం కాద ని, సామాన్య జనం సొంతమైన నమ్మకాలు వారు పాటించే సిద్ధాంతాలు, సాంప్రదాయక విలువలను వారి ఆచరణ చాటిచెప్పిందని తెలిపారు. ప్రధాని నూలుతో చేసిన పూర్తిస్థాయి గమ్చా మాస్క్ ధరించి గ్రామ పంచాయతీ సభ్యులతో ముచ్చటించారు. తొలుత పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో పెద్ద ఎత్తున నిర్వహించాలని తలపెట్టారు. అయితే కరోనా కారణంతో దీనిని వీడియో కాన్ఫరెన్స్ రూపంలో నిర్వహించాల్సి వచ్చింది.

అనేక కొత్త సవాళ్లు
దేశం ఇంతవరకూ చవిచూడని, అసలు ఊహించని పలు సవాళ్లను కరోనా సృష్టించిందని ప్రధాని తెలిపారు. ఇదే సమయంలో సరికొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన రేకెత్తింది. అంతేకాకుండా మనలో మరుగున పడ్డ పరిజ్ఞానాన్ని మనకు గుర్తు చేసిందన్నారు. అన్నింటికి మించి మనం మన కాళ్లపై నిలబడాలి, స్వయం సమృద్థి సాధించాలనే కీలక విషయం తెలిసివచ్చిందని ప్రధాని తెలిపారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో ఎవరూ ఇతరులపై ఆధారపడ రాదని, ఆధారపడినా ఫలితం లేదని స్పష్టం అయిందని, స్వయంసమృద్థిగా నిలిచి సాగాలనే విషయం తెలిసివచ్చిందని ప్రధాని తెలిపారు. రవాణా వ్యవస్థ నిలిచిపోయి, ఇతరత్రా సౌకర్యాలు కుంటుపడ్డ తరుణంలో గ్రామాలు స్వయం సమృద్థిగా ఉండాలనే విషయం స్పష్టం అయిందన్నారు. ప్రతి గ్రామసభ, బ్లాక్ ప్రతి జిల్లా కనీస అవసరాల కోసం సొంత వనరులను సంతరించుకోవాలనే విషయం ఇప్పుడు రూఢీ అయిందన్నారు.

ప్రపంచం అంతా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోందని, పలు దేశాలలో కరోనా భారీ ప్రాణనష్టం కల్గించిన దశలో ఇండియా ఏ విధంగా కరోనాను నియంత్రించిందనే విషయం చర్చనీయాంశం అయిందన్నారు. ఇది అంతా కూడా గ్రామీణ ప్రజల పట్టుదల, వారు పాటించిన పద్థతులతోనే సాధ్యం అయిందన్నారు. ఏ విషయాన్ని అయినా ప్రజలు మనసు మీదకు తెచ్చుకుంటే, దానిని ఆచరించి చూపుతారని, ఈ క్రమంలో కరోనాను తరిమికొట్టేందుకు భౌతికదూరం పాటించి ఈ విషయంలో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. పరిమిత వనరులతో సామాన్య జనం కరోనా కష్టాలతో కుంగిపోకుండా, సవాళ్లను తిప్పికొట్టేందుకు సమాయత్తం కావడం సాధారణ విషయమేమీ కాదన్నారు.

ఇదో విచిత్ర వైరస్
ఇప్పుడు వచ్చిపడ్డ వైరస్ అత్యంత విచిత్రమైనదని, ఇది తనకుతానుగా ప్రజల ఇళ్లల్లోకి చొరబడదని, దొంగబుద్థి లేదని, అయితే సరైన పద్ధతులు పాటించకుండా తిరిగితే మనమే దీనిని వెంటబెట్టుకుని వంటికి, ఇంటికి అంటించుకుంటున్నామని, ఇక ఇది అప్పుడు ఎవరిని వదలేది లేదనే రీతిలో వ్యవహరిస్తుందన్నారు. వైరస్ కన్నా తప్పుడు సమాచారాలు, వదంతులు ప్రమాదకరం అయినవని ప్రధాని హెచ్చరించారు.

ఇంటి భోజనం ఆరోగ్యకరం
మనం ఇంట్లోనే సరైన రీతిలో వండుకుని సిద్ధం చేసే ఆహారం ఎంతో ఆరోగ్యకరమని తేలిందన్నారు. కరోనా దశ ఈ విధంగా మంచి ఫలితం ఇచ్చిందన్నారు. కొన్ని రకాల వంటలు ప్రత్యేకించి కడ్డా వంటి ఆయుర్వేద ఇంటి మందు రోగనిరోధక శక్తిని పెంచుతుందని తేలిందన్నారు. సరైన రోగ నిరోధక శక్తితో ఉండే వ్యక్తి సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ ఇతరత్రా అనారోగ్యాలను తట్టుకుని నిలబడగల్గుతారని తెలిపారు. కరోనాతో ప్రజల జీవితాలలో పెనుమార్పులు వచ్చాయని, పనివిధానాలు మారాయని, ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, తరచూ చేతులు కడుక్కోవాలి, ముఖాన్ని ఇంట్లోనే తయారుచేసుకున్న గమ్చాతో కప్పుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ను అనుసంధానం చేసుకోవాలన్నారు. ఇప్పుడు గ్రామపంచాయతీలకు సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిందని, గతంలో కేవలం 100 గ్రామ పంచాయతీలకే బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం ఉండేదని, ఇప్పుడు అది లక్ష పాతిక వేల గ్రామ పంచాయతీ కార్యాలయాలకు విస్తరించిందని తెలిపారు.

ప్రధాని మోడీ శుక్రవారం ఇ గ్రామ స్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. దేశంలోని కొందరు సర్పంచ్‌లు, పంచాయతీ సభ్యులు ప్రధానితో ఈ సందర్భంగా మాట్లాడారు. కరోనా సమయంలో గ్రామాలలో పరిస్థితిని వివరించారు. లాక్‌డౌన్‌ను ప్రజలంతా మతపరమైన ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పాటిస్తున్నారని సర్పంచ్‌లు చెప్పారు. ప్రస్తుత కరోనా ప్రజల మధ్య అనుమానాలను , ఇదే సమయంలో పరస్పర గౌరవాన్ని పెంచిందని, ఈ రెండింటిని సరిగ్గా బేరీజు వేసుకుని సాగితే కరోనా నియంత్రణ తేలిక అవుతుందని జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఒక సర్పంచ్ చెప్పారు.

 

PM Modi video conference with Sarpanches
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News