హిరోషిమా : ప్రధాని మోడీ జపాన్ పర్యటన దశలో క్వాడ్ నేతలతో భేటీ అయ్యారు. ఈ దశలో అమెరికా అధ్యక్షులు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనెస్‌లు ప్రధాని మోడీ వద్దకు వచ్చి మీరు మా దేశాల పర్యటనకు రావడమోమో కానీ బాగా చిక్కుల్లో పెడుతున్నారని తెలిపారు. దీనితో కొద్ది సేపు కంగుతిన్న మోడీ ఆ తరువాత వారి మాటలు విని నవ్వారు. ప్రధాని మోడీ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు బైడెన్ దంపతుల ఆహ్వానంపై వెళ్లుతున్నారు. వైట్‌హౌస్ విందులో కూడా పాల్గొంటారు. పలు ఇష్టాగోష్టి కార్యక్రమాలకు హాజరవుతారు.
ఇదంతా బాగానే ఉంది కానీ హాలీవుడ్ సినిమా స్టార్లు మొదలుకుని పలు రంగాలకు చెందిన వారు మోడీ సభలకు రావాలనుకుంటున్నారని, తెలిసిన వారు తెలియని వారు కూడా ఇందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారని బైడెన్ చెప్పారు. ఇది పెద్ద తలనొప్పి అయిందన్న బైడెన్ ఇప్పుడే ఆటోగ్రాఫ్ ఇస్తారా? అని చమత్కరించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీకి కూడా ఇదే సమస్య ఏర్పడింది. సిడ్నీలో ప్రధాని మోడీతో జరిగే ఇంటరాక్ట్ కోసం ఏర్పాటు అయిన వేదికకు హాజరయ్యేందుకు వేల సంఖ్యలో తనకు ఫోన్లు చేస్తున్నారని, ఈ సభకు ఇప్పటికే ఖరారయిన 20వేల టికెట్లు అమ్ముడుపొయ్యాయని, అయినా ఫోన్లు ఆగడం లేదని, రాకముందే తిప్పలు తెచ్చిపెట్టారని మోడీతో నవ్వుతూ తెలిపారు.