న్యూఢిల్లీ : నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడెర్న్ ఆర్ట్ ఇక్కడ నిర్వహించిన థెమటిక్ “జనశక్తి” ఎగ్జిబిషన్‌ను ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం సందర్శించారు. ప్రధాని నెలవారీ మన్‌కీబాత్ రేడియో కార్యక్రమం వంద ఎపిసోడ్‌లు పూర్తయిన సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. అనేక మంది ప్రఖ్యాత కళాకారులు రూపొందించిన తమ కళాఖండాలను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ప్రధాని మోడీ ఎగ్జిబిషన్ లోకి ప్రవేశించి అంతా కలియచూసి నడుస్తూ వెళ్తుండడం కళాకారులకు తమ పనుల గురించి స్వయంగా వివరించడానికి అవకాశం లభించింది. అలాగే మన్‌కీబాత్ సంకల్పాలు తమకు స్ఫూర్తి కలిగించాయని సాంస్కృతిక మంత్రిత్వశాఖ వెల్లడించింది.
జైపూర్ హౌస్ గోపురం ప్రధానిని అమితంగా ఆకర్షించిందని తెలియజేసింది. కళా ప్రదర్శనలను తిలకించిన తరువాత జనశక్తి కేటలాగ్‌పై ప్రధాని సంతకం చేశారు. ఈ సందర్భంగా “ మన్ మందిర్ కి యాత్రా సుఖద్ హో ” అని ప్రధాని తన సందేశం వివరించారు. ఈ కేటలాగ్ అంతకు ముందు 13 మంది కళాకారుల సంతకాలతో నిండి ఉంది. కొన్ని చిత్రాలను తన ట్విటర్‌లో ప్రధాని షేర్ చేసుకున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను తమ సృజనాత్మకతతో అద్భుత కళాఖండాలతో సుసంపన్నం చేసిన కళాకారులకు అభినందనలు అని ప్రధాని ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ వ్యక్తం చేసిన 12 సంకల్పాలకు వివిధ రూపాలలో కళాత్మకత చేకూర్చడంలో ప్రఖ్యాత 13 మంది కళాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.