న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రముఖ వార్తాసంస్థ పిటిఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి మోడీ ఓ వార్తా సంస్థ కార్యాలయం న్యూస్‌రూంకు వెళ్లడం ఇదే తొలిసారి అయింది. ఇక్కడి కార్యాలయంలో నూతనంగా ప్రారంభించిన వీడియో సర్వీసెస్ విభాగాన్ని, ఇందులోని పనితీరును ఆయన దగ్గరుండి తిలకించారు. దాదాపు గంట పాటు ప్రధాని ఇక్కడనే ఉన్నారు. పిటిఐ సిబ్బందితో బ్యాచ్‌ల వారిగా మాట్లాడారు. సీనియర్ ఎడిటోరియల్ . కార్యనిర్వాహక వర్గంతో మాట్లాడి సాధకబాధకాలు తెలుసుకున్నారు.మీడియా ముందున్న సవాళ్లు, అవకాశాల గురించి వారితో సమీక్షించారు. పిటిఐ వార్తాసంస్థ 1947లో ఏర్పాటు అయింది. రెండేళ్ల తరువాత వార్తా ప్రసరణం ఆరంభించారు.
ఇక్కడికి వచ్చిన ప్రధాని పిటిఐ కార్యనిర్వాహక అధికారి, ఎడిటర్ ఇన్ చీఫ్ విజయ్ జోషీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. తన రాజకీయ జీవిత పయనం గురించి ముచ్చటించారు. విజిటర్స్ బుక్‌లో సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఓ కవిత చదివారు. ఆచారం, విచారం, ఇప్పుడు సమాచారం ఇప్పుడు నిత్యజీవిత సంబంధితాలయ్యాయని తెలిపారు. ఇక్కడికి వచ్చిన మోడీకి పిటిఐ సంస్థ తరఫున పిటిఐ ప్రతీకాత్మక చిత్రాన్ని బహుకరించారు. వారణాసిలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచార ఘట్టం దశలో మోడీ అశేష జనసందోహం మధ్య ఉన్నప్పటి చిత్రం కానుకగా అందించారు.