అబూధాబి : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( యుఎఇ)కి వచ్చారు. అబూధాబిలో యుఎఇ అధ్యక్షులు షేక్ మెహమ్మద్ బిన్ జాయెద్ నహ్యాన్‌తో వివిధ అంశాలపై సమగ్ర చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య వ్యాపార లావాదేవీలకు స్థానిక కరెన్సీలను వాడుకునేందుకు వీలు కల్పించేందుకు అంగీకారం కుదిరింది. దీని వల్ల విదేశీ మారకద్రవ్య చిక్కులు లేకుండానే వ్యాపార వాణిజ్య సంబంధిత లావాదేవీలకు డబ్బుల సర్దుబాట్లు తక్షణం జరిగేందుకు దారితీస్తుంది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య త్వరితగతిన చెల్లింపుల అనుసంధాన పద్థతిని కూడా ఆరంభించాలని నిర్ణయించారు. ఇరుదేశాల మధ్య ఇప్పటికే ఉన్న కీలకమైన ద్వైపాక్షిక ఆర్థిక పటిష్ట సంబంధాల దిశలో ఇది మరింత ముందడుగు అవుతుందని ప్రధాని మోడీ ఆ తరువాత తెలిపారు.
ఇప్పుడు ఏర్పాటు అయ్యే ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్ ద్వారా భారతదేశ యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ)తో గల్ఫ్‌కు చెందిన ఇన్‌స్టాంట్ పేమెంట్ ప్లాట్‌ఫాం ( ఐపిపి) అనుసంధానం అవుతుంది. దీనితో ఇరుదేశాల మధ్య వ్యాపార లావాదేవీల చెల్లింపులు తక్షణం జరిగే వీలేర్పడుతుంది. గత ఏడాది ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం జరిగిన నాటి నుంచి ఇరుదేశాల మధ్య వాణిజ్య లావాదేవీలలో 20 శాతం మేర పెరుగుదల కన్పించిందని ప్రధాని మోడీ యుఎఇ ప్రెసిడెంట్‌తో చర్చల తరువాత తెలిపారు. పరస్పర వాణిజ్య, పెట్టుబడుల దిశలో కరెన్సీ సంక్లిష్టతలు, చెల్లింపుల జాప్యాలు అడ్డంకి కాకూడదనే ఆలోచనతోనే ప్రధాన నిర్ణయాలు తీసుకున్నట్లు మోడీ చెప్పారు. షేక్ మెహహ్మద్ నుంచి తనకు సోదర ప్రేమ లభించిందని తెలిపారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇరుదేశాల సెంట్రల్ బ్యాంక్‌ల మధ్య కుదిరిన ఎంఒయులు కీలకమైనవని చెప్పారు.
ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంతదాస్, యుఎఇ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఖాలీద్ మెహమ్మద్ బలామాలు ప్రధాని మోడీ, నహ్యాన్‌ల సమక్షంలో ఎంఒయులపై సంతకాలు చేశారు. ఫ్రాన్స్ నుంచి శనివారం ఉదయం అబూధాబికి వచ్చిన ప్రధాని మోడీకి అధ్యక్షులు నెహ్యాన్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. తరువాత ప్రధాని మోడీ గౌరవ వందనం లభించింది. ఐక్యరాజ్యసమితి చొరవతో ప్రపంచ వాతావరణ పరిరక్షణ దిశలో ఏర్పాటు అయిన కాప్ 28 సదస్సుకు ఈ సారి యుఎఇ సారథ్యం వహించనుంది. దుబాయ్‌లో ఈ ఏడాది నవంబర్ 28 నుంచి జరిగే ఈ సదస్సుకు భారతదేశం నుంచి పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని ప్రధాని తెలిపారు. కాప్ సదస్సుకు దేశాధ్యక్ష ప్రతినిధి సుల్తాన్ అల్ జబేర్ శనివారం ఇక్కడ ప్రధాని మోడీతో మాట్లాడారు. సదస్సు గురించి వివరించారు.
అధ్యక్ష భవనంలో ప్రధాని మోడీకి ప్రత్యేక విందు
సేంద్రీయ కూరగాయాల వంటలు ..ప్రత్యేకమైన నూనె
అబూధాబిలో ప్రధాని మోడీకి దేశాధ్యక్షులు నహ్యాన్ తమ అధికారిక నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోడీకి ఆద్యంతం ప్రత్యేకమైన కూరగాయలతో కూడిన శాకాహార షడ్రుచుల భోజనం అందించారు. స్థానికంగా సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరలతో , గోధుమల హరీస్‌తో, ఖర్జూర సలాడ్, మసాలా సాస్, పండ్లు వంటివాటితో విందు ఏర్పాటు అయింది. ప్రధాని మోడీ శాకాహారి కావడంతో ఈ ఏర్పాట్లు జరిగాయి. వంటకాలకు వాడిన నూనె కూడా కూరగాయలతో తయారు చేసిందే. విందుకు ముందు స్టార్టర్లుగా దోరగా కాల్చిన కూరగాయలను వడ్డించారు.