Monday, December 23, 2024

ఉగ్రవాదంపై రెండు నాల్కల ధోరణి వద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్‌సిఓ దేశాలు వెనకాడకూడదని కూడా ఆయన స్పష్టం చేశారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ముందే ఆయన దాయాది దేశంపై పరోక్షంగా ధ్వజమెత్తారు. భౌగోళిక వివాదాలు, ఉద్రిక్తతలు, మహమ్మారులతో పోరాడుతున్న అనేక దేశాలకు ఇప్పుడు ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత ప్రధాన సమస్యలుగా ఉన్నాయని ప్రధాని అన్నారు.

ప్రధాని మోడీ అధ్యక్షతన షాంఘై సహకార సంస్థ( ఎస్‌సిఓ) సమావేశం మంగళవారం జరిగింది. వర్చువల్‌గా జరిగిన ఈ భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లతో పాటుగా ఇతర సభ్య దేశాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. పాక్‌పై పరోక్షంగా విరుచుకు పడ్డారు.‘ కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని తమ విదేశాంగ విధానంలో భాగంగా చేసుకుంటున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను సమకూర్చడం వాటిని నిరోధించడానికి నిర్ణయాత్మక చర్యలు అవసరం. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను విమర్శించడంలో ఈ కూటమి ఎప్పుడూ వెనకాడకూడదు. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెనుముప్పుగా మారింది.

దానిపై మనమంతా కలిసికట్టుగా పోరాడాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు. షాంఘై సహకార సంస్థ అనేది కేవలం పొరుగుదేశాల కూటమి కాదు. మనమంతా ఒకే కుటుంబం. భద్రత, ఆర్థికాభివృద్ధి, అనుసంధానత, ఐక్యత,సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించుకోవడం, ప్రాదేశిక సమగ్రత, పర్యావరణ పరిరక్షణ.. ఇవన్నీ మన సదస్సుకు మూలస్తంభాలు అని మోడీ అన్నారు. ఇక ఈ సదస్సులో ఉక్రెయిన్‌లో అనిశ్చితి, అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి, వాణిజ్యం తదితర అంశాలపై చర్చించారు. 2001లో రష్యా , చైనా, కిర్గిజిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అధ్యక్షులు షాంఘై సహకార సంస్థను ప్రారంభించారు. 2005లో భారత్ అబ్జర్వేటర్‌గా ఈ కూటమిలో చేరింది. ఆ తర్వాత 2017లో శాశ్వత సభ్య దేశంగా మారింది. తాజాగా ఈ సంవత్సరం ఇరాన్ కూడా ఈ కూటమిలో చేరింది.

ఎవరు పాల్పడినా ఎదుర్కొని తీరాల్సిందే:షెహబాజ్
తీవ్రవాదం, ఉగ్రవాదం అనేవి అనేక పడగులన్న రాక్షసుడి లాంటివని, వ్యక్తులు, గ్రూపులు, లేదా ప్రభుత్వాలు ఎవరు పాల్పడినప్పటికీ వీటిని పూర్తి బలం, కృతనిశ్చయంతో పోరాడి తీరాల్సిందేనని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. అయితే దౌత్యపరంగా పై చేయి సాధించడం కోసం ఉగ్రవాదాన్ని ఓ ఆయుధంగా వాడుకోరాదని ఆయన సూచించారు. వర్చువల్‌గా జరిగిన ఎస్‌సిఓ సదస్సులో షరీఫ్ మాట్లాడుతూ , ప్రభుత్వ ప్రోత్సాహిత ఉగ్రవాదం సహా అన్నిరకాల ఉగ్రవాదాన్ని ఖండించి తీరాల్సిందేనని, కారణాలు ఏమయినప్పటికీ అమాయక ప్రజలను హతమార్చడం ఏ విధంగాను సమర్థనీయం కాదని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో పాక్ చేసిన త్యాగాలు అసమానమైనవని ఆయన అంటూ, అయినప్పటికీ ఈ మహమ్మారి ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తూనే ఉందని,శాంతి, సుస్థిరతలకు తీవ్రమైన అడ్డంకిగా ఉందని అన్నారు. కాగా తన ప్రసంగంలో కశ్మీర్ సమస్యను లేవనెత్తడానికి ప్రయత్నించిన షరీఫ్ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వివాదాలను పరిష్కరించే విషయంలో ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రాధాన్యతను ప్రధానంగా ప్రస్తావించారు.

ప్రాంతీయ శాంతిపరిరక్షణ, ఉమ్మడి భద్రత కోసం కృషి చేయాలి: జిన్‌పింగ్

కాగా ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయడంలో ఆచరణాత్మక సహకారంపై దృష్టిపెట్టడంతో పాటుగా ప్రాంతీయ శాంతి పరిరక్షణ, ఉమ్మడి భద్రత కోసంఎస్‌సిఓ దేశాలు కృషి చేయాలని సమావేశంలో ప్రసంగించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కోరారు. అంతేకాకుండా బహుపాక్షికతను పరిరక్షించడంతో పాటుగా ప్రపంచపాలనను మెరుగుపర్చడంపై దృష్టిపెట్టాలని కూడా ఆయన నొక్కి చెప్పారు. ఆధిపత్య ధోరణి, అధికార రాజకీయాలను వ్యతిరేకించాలని , ప్రపంచ పాలన న్యాయబద్ధమైనదిగా, సమానమైదిగా ఉండేలా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.

అలాగే వేల కోట్ల డాలర్ల పెట్టుబడితో చేపడుతున్న తమ పెట్ ప్రాజెక్టయిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్‌ఐ) కింద అత్యంత నాణ్యమైన సహకారాన్ని సమ్మిళితం చేసుకోవాలని ఎస్‌సిఓ సభ్య దేశాలను ఆయన కోరారు.2013 జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఈ బిఆర్‌ఐ ప్రాజెక్టు కింద భూ, సముద్ర మార్గాలద్వారా ఆగ్నేయాసియా, మధ్యఆసియా, గల్ఫ్ ప్రాంతం,ఆఫ్రికా, ఐరోపాలను అనుసంధానం చేయాలన్నది లక్షం. ఇందులో ప్రధానమైనది చైనా పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ నిర్మాణం. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా సాగే ఈ ప్రాజెక్టును భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News