వినూత్న వస్త్ర ధారణలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ప్రతి వేడుకలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విభిన్న వస్త్రధారణతో దర్శనమిస్తుంటారు. బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ఆయన తలపై టోపీ, మెడలో కండువాను ధరించి కనిపించారు. టోపీ ఉత్తరాఖండ్ సంప్రదాయానికి చిహ్నం కాగా, కండువా మణిపూర్ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. అలాగే ఆ టోపీపై బ్రహ్మ కమలం గుర్తు ఉంది.అది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం. కేదారినాధ్ ఆలయంలో ఎప్పుడు పూజలు చేసినా, మోడీ బ్రహ్మకమలం పుష్పాలను ఉపయోగిస్తారని అధికారులు చెప్పారు. కాగా దీనిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి స్పందించారు. 1.25 కోట్ల తన రాష్ట్ర వాసుల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలియచేశారు. ఇక మోడీ ధరించిన కండువా చేతితో నేసింది.ఇది మణిపూర్ లోని మేటీ తెగ వినియోగించే ప్రత్యేక వస్త్రం. ఇదిలా ఉండగా, కొద్ది రోజుల్లో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఉత్తరాఖండ్, మణిపూర్ కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఆ రాష్ట్రాల సంస్కృతికి తగినట్టుగా మోడీ వస్త్రధారణ ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తరాఖండ్‌లో ఫిబ్రవరి 14న , మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3న ఎన్నికలు జరగనున్నాయి.