Monday, December 23, 2024

75 వేల మంది యువతకు మోడీ “దీపావళి” గిఫ్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి కానుకలు అందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ శనివారం (అక్టోబరు 22) ప్రధాని మోడీ 75 వేల మంది యువతతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. పలు మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన యువతకు ఈ అపాయింట్‌మెంట్ లెటర్లను అందించనున్నారు. అక్టోబర్ 22న ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోడీ ‘రోజ్‌గార్ మేళా’ను ప్రారంభించనున్నట్టు పీఎంఓ గురువారం వెల్లడించింది. ఈ సందర్భంగా రక్షణ, రైల్వే, హోం, కార్మిక ఉపాధి శాఖలు, తపాలా శాఖ, సీఐఎస్‌ఎఫ్, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ తదితర రంగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతతో మోడీ ముచ్చటించనున్నారు. దేశ వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కూడా పాల్గొననున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఒడిశా నుంచి, ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ గుజరాత్ నుంచి, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చండీగఢ్ నుంచి, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మహారాష్ట్ర నుంచి, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తమిళనాడు నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు ఆయా వర్గాలు వెల్లడించాయి. దేశంలో నిరుద్యోగం పై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రానున్న 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగం గానే పలు ప్రభుత్వ విభాగాల్లో ఇటీవల ఉద్యోగాల భర్తీ చేపట్టారు.

PM Modi will launch Rozgar Mela on Oct 22

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News