Friday, January 24, 2025

జులై 8న రష్యాకు ప్రధాని మోడీ పయనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8, 9 తేదీలలో రష్యాను సందర్శించనున్నారు. 22వ భారత్-రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొని ఉభయ దేశాల మధ్య కొనసాగుతున్న బహుముఖ సంబంధాలను సమీక్షించనున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఇఎ) గురువారం ప్రకటించింది. రష్యా పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని మోడీ ఆస్ట్రియాకు పయనమవుతారని ఎంఇఎ తెలిపింది. గడచిన 41 సంవత్సరాలలో భారత ప్రధాని ఆస్ట్రియాను సందర్శించడం ఇదే మొదటిసారి. గత ఐదేళ్లలో రష్యాను సందర్శించడం మోడీకి ఇదే మొదటిసారి.

2019లో ఆయన చివరిసారి రష్యాను సందర్శించారు. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో జరిగిన ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. రష్యా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై రెండు దేశాల అగ్నేతలు చర్చలు జరిపే ప్రధాన వేదికగా వార్షిక సదస్సును పరిగణిస్తారు. ఇప్పటి వరకు 21సార్లు వార్షిక సదస్సులు భారత్, రష్యాలో ఒవ దేశం తరువాత మరో దేశంలో జరుగుతున్నాయి. 2021 డిసెంబర్ 6న న్యూఢిల్లీలో జరిగిన 21వ వార్షిక సందస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత మొదటిసారి భారత ప్రధాని మోడీ రష్యాను సందర్శించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా నుంచి ప్రధాని మోడీ ఆస్ట్రియా వెళతారు.

జులై 9, 10 తేదీలలో ఆయన ఆస్ట్రియాలో ఉంటారు. ఆస్ట్రియా రిపబ్లిక్ అధ్యక్షుడు అలెక్జాండర్ వాన్ డెర్ బెలెన్‌తో ప్రధాని మోడీ భేటీ అవుతారు. ఆస్ట్రియా చాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో కూడా మోడీ చర్చలు జరుపుతారని ఎంఇఎ తెలిపింది. అంతేగాక భారత్, ఆస్ట్రియాకు చెందిన వ్యాపార దిగ్గజాలను ఉద్దేశించి ప్రధాని మోడీ, ఆస్ట్రియా చాన్సలర్ ప్రసంగిస్తారని ఎంఇఎ పేర్కొంది. మాస్కోతపాటు ఆస్ట్రియా రాజధాని వియన్నాలో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని ప్రధాని మోడీ కలుసుకుంటారని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News