Friday, November 22, 2024

మోడీజీ.. ‘అగ్నిపథ్’ ఉపసంహరించుకోండి

- Advertisement -
- Advertisement -

మోడీజీ.. ‘అగ్నిపథ్’ ఉపసంహరించుకోండి
సైన్యాన్ని బలహీనపరుస్తున్న కేంద్రం
ఇడి ప్రశ్నిస్తున్న వేళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నా వెంటే ఉన్నారు
పార్టీ శ్రేణుల సత్యాగ్రహలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
దేశాన్ని ఇద్దరు ముగ్గురు పారిశ్రామిక వేత్తలకు ప్రధానిఅమ్మేస్తున్నారంటూ మండిపాటు

న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకాన్ని తీసుకు రావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని బలహీన పరుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గతంలో సాగు చట్టాలను ఉపసంహరించుకున్నట్లుగానే అగ్నిపథ్‌ను కూడా ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి ప్రతీకార రాజకీయాలు, అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సత్యాగ్రహలో రాహుల్ మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ప్రశ్నిస్తున్న సమయంలో తనకు మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇడి తనను ప్రశ్నిస్తున్న సమయంలో తాను ఒంటరిగా లేనని.. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నేతలు తన వెంటే ఉన్నారని అన్నారు. దేశంలో అతిపెద్ద సమస్య ఉద్యోగాలేనన్న రాహుల్ కేంద్ర ప్రభుత్వం చిన్న, మధ్య తరగతి వ్యాపారాలను దెబ్బతీయడం ద్వారా దేశ వెన్నెముకను విరగ్గొడుతోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ మన దేశాన్ని ఇద్దరు, ముగుగ్రు పారిశ్రామికవేత్తలకు అప్పగించారని, చివరికి ఇప్పుడు సైన్యంలో ఉద్యోగాలను కూడా మూసి వేశారని దుయ్యబట్టారు. ‘ఇప్పుడు ఉదయాన శిక్షణ పొంది తర్వాత సైన్యంలో చేరి ఆ తర్వాత ఇంటికి పొమ్మంటున్నారు.

సైన్యంలో పని చేసిన తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగం రాదని నేను గ్యారంటీగా చెప్పగలను’ అని రాహుల్ అన్నారు. సైన్యాన్ని బలోపేతం చేయాలని, అయితే ఈ ప్రభుత్వం దాన్ని బలహీనం చేస్తోందని కూడా ఆయన అన్నారు. ‘చైనా సైన్యం మన భూభాగంలో తిష్టవేసుకుని ఉంది. వాళ్లు వెయ్యి చదరపు కిలోమీటర్ల మన భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. ఈ వాస్తవాన్ని మన ప్రభుత్వం కూడా అంగీకరించింది’ అని రాహుల్ చెప్పారు. ఎప్పుడూ ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ గురించి మాట్లాడే ప్రభుత్వం ఇప్పుడు ‘నో ర్యాంక్.. నో పెన్షన్’ అని అంటోందని అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి దేశానికి నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇడి విచారణ చాలా చిన్న విషయమని, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, అగ్నిపథ్ పెద్ద సమస్యలని రాహుల్ గాంధీ అన్నారు. ఇడి లాంటి ఏజన్సీలు తనపై ఒత్తిడి తేలేవని, బెదిరింపులకు గురి చేయలేరని తనను ప్రశ్నించిన అధికారులు సైతం అర్థం చేసుకున్నారన్నారు. కాగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 27న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ చెప్పారు.

PM Modi will withdraw agnipath Scheme: Rahul Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News