Thursday, January 23, 2025

ఆనాడే ఊహించిన మోడీ.. నాలుగేళ్ల నాటి వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్ అల్లర్ల అంశంపై పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ఎలాగైనా మాట్లాడించాలని ప్రయత్నిస్తున్నే విపక్ష కూటమి “ఇండియా తాజాగా అవిశ్వాస తీర్మాన అస్త్రంతో సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు కాంగ్రెస్, భారాస బుధవారం స్పీకర్‌కు నోటీస్‌లిచ్చాయి. అయితీ ఈ అవిశ్వాసాన్ని ప్రధాని మోడీ నాలుగేళ్ల క్రితమే ఊహించారు.

ఇందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి తాజాగా బయటికొచ్చింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మోడీ దీని గురించి ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ “ 2023 లోనూ నాపై అవిశ్వాసం తీసుకొచ్చేలా మీకు అవకాశం రావాలి. అందుకు మీరు సిద్ధమవ్వాలని కోరుకుంటున్నా” అని మోడీ అనడంతో అధికార పక్షసభ్యులు నవ్వులు చిందించారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని ఎద్దేవా చేస్తూ నాడు మోడీ ఇలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ ఒకప్పుడు లోక్‌సభలో 400 కు పైగా స్థానాలు సాధించిన కాంగ్రెస్ 2014 లో దాదాపు 40 స్థానాలకు పరిమితమైంది.

వారి అహంకారం వల్ల జరిగిన పరిణామం అది. కానీ మా సేవాభావం వల్లే బీజేపీ రెండు స్థానాల నుంచి ఒంటరిగా అధికారం లోకి వచ్చే స్థాయికి ఎదిగింది. ” అని మోడీ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. తాజాగా మణిపూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల కూటమి అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవడంతో ఆ వీడియోను దూరదర్శన్ (డీడీ న్యూస్ ) ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక ఎన్డీయే సర్కారుపై 2018లో అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. అప్పుడు ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News