విశాఖలో రైల్వే స్టేషన్ నవీకరణ పనులకు శంకుస్థాపన
అమరావతి: వచ్చే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. నవంబర్ 11న విశాఖపట్నంలో రూ. 400 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్ నవీకరణ, ఇతర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీతో భోగాపురం విమానాశ్రయం, విజయనగరంలో గిరిజన విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేయించే విధంగా ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. విశాఖ పర్యటనలో భాగంగా నవంబర్ 11న ప్రధాని మోడీ ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుకానున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే ఎపి బిజెపి నేతలతో ప్రధాని ప్రత్యేకం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని తన పర్యటన సందర్భంగా విశాఖపట్నం రైల్వే జోన్, వెనుకబడిన ఉత్తరాంధ్రా జిల్లా అభివృద్ధికి సంబంధించిన నిధుల కేటాయింపు పైనా ప్రకటన చేసే అవకాశముందని భావిస్తున్నారు. ఈ ఏడాది జూలై 4న పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం వచ్చిన ప్రధాని మోడీ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి, అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలో పటిష్ట భద్రతా ఏర్పాట్లకు ప్రభుత్వం సిద్ధమైంది.