కరోనా దుస్థితిపై సిడబ్ల్యుసి తీర్మానం
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ పరిస్థితి నేపథ్యంలో చేసిన తప్పిదాలకు ప్రధాని మోడీనే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) పేర్కొంది. ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఇటువంటి దశలో సరైన విధంగా సేవలు అందించాలి. అంతేకానీ తన వ్యక్తిగత అజెండాతో తప్పులమీద తప్పులు చేస్తూ పోతూ ఉంటే ఇటువంటి సంక్షోభాలు మరింత విషమిస్తాయని విమర్శిస్తూ సోమవారం జరిగిన సిడబ్లుసిలో తీర్మానం వెలువరించారు. వ్యక్తిగత అజెండాలు సాగదీయాలనుకుంటే పరిస్థితి మరింత విషమిస్తుందని హెచ్చరించారు. దేశంలో కరోనా కేసులు , మరణాలపై కేంద్ర ప్రభుత్వం వెలువరిస్తోన్న గణాంకాలు నమ్మశక్యంగా లేవని పార్టీ విమర్శించింది. అనేక మరణాలను కరోనా కేసులతో కలుపడం లేదని, పరిస్థితిని పూర్తిగా దాచిపెడుతున్నారని పార్టీ విమర్శించింది. నిజాలను దాచిపెట్టడం కాదు, సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉందన్నారు.
ప్రధాని మోడీకి అన్నిస్థాయిల్లో తన వ్యక్తిగత అభిప్రాయాలను ప్రజలపై మోపడం ఆనవాయితీ అయిందని, అయితే ఇటువంటి వైరస్ పట్ల కూడా ఇదే పద్థతి పాటిస్తే అది చివరికి దారుణాతిదారుణ పరిస్థితిని తెచ్చిపెడుతుందని హెచ్చరించారు. ఓ వైపు కరోనా మరణాల సంఖ్యను దాచిపెడుతున్నారు. ఇంకోవైపు వ్యాక్సినేషన్ల ప్రక్రియలో లోపాలు ఉన్నాయి. ఇప్పుడు అందుతున్న సరఫరాలు అరకొరగానే ఉన్నాయని, ధరల ఖరారు గందరగోళం, ఏకపక్షం, వివక్షపూరితంగా ఉందన్నారు. ఇది వైద్యపరమైన అత్యయిక పరిస్థితి. ఈ దశలో అంతా స్థిరమైన జాతీయ ఐక్యత, అంతకు మించి నిర్ధేశిత లక్షం దిశలో ముందుకు సాగడం వంటి విధానాలను పాటించాల్సి ఉందని పార్టీ అత్యున్నత స్థాయి కార్యవర్గం భేటీలో పిలుపు నిచ్చారు. దేశంలో కరోనా పరిస్థితి, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి పేలవ ఫలితాలు వంటి వాటిపై విశ్లేషణకు సిడబ్లుసి భేటీ జరిగింది.