Monday, December 23, 2024

యువతను మోసం చేస్తున్న మోడీ: హిమాగ్నరాజ్ భట్టాచార్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మూఢత్వాన్ని పెంపొందించే విధంగా పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారని, నేడు దేశంలో 30 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయకుండా నిరుద్యోగులను కేంద్రం మోసం చేస్తుందని డివైఎఫ్‌ఐ ఆఖిల భారత కార్యదర్శి హిమాగ్నరాజ్ భట్టాచార్య విమర్శించారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ ) కేంద్ర కమిటి సమావేశాలు రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని ప్రైవేటుపరం చేస్తూ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తుందన్నారు.

ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక యువజన వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం అధికారం నుండి వైదొలగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డివైఎఫ్‌ఐ అధ్వర్యంలో అందరికి ఉపాధి కల్పించాలని లౌకిక భారతదేశం కోసం దేశవ్యాప్తంగా ఆగష్టులో జాతాలను చేపట్టి యువతను జాగృతం చేస్తామన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ ని అరెస్టు చేయాలని మహిళా రెజ్లర్లు ఏప్రిల్ 17 నుంచి నిరసనలు చేస్తున్నారు. భాజపా ఎంపీలు బ్రిజ్‌భూషణ్ సింగ్, సందీప్ సింగ్ లపై తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరవధికంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లపై పోలిసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా డివైఎఫ్‌ఐ అఖిలభారత అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఎఎ రహీం మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను పూర్తిగా విస్మరించిందని అన్నారు. దేశ రక్షణ వ్యవస్థను ప్రమాదంలో పడే విధంగా అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దేశ భవిష్యత్ ని యువత నిర్ణయిస్తుందని, మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువతని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశాలకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి కేంద్ర కమిటి సభ్యులు హాజరయ్యారు.

ఈసందర్భంగా ఢిల్లీ జంతర్ మంతర్ లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రేజర్లపై ప్రభుత్వం, పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తూ దాడులు చేసి అరెస్టులు చేయడానికి నిరసిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సమావేశంలో డివైఎఫ్‌ఐ అఖిలభారత కార్యదర్శివర్గ సభ్యులు జెక్ థామస్,ఆనగంటి వెంకటేష్, సంజీవ్ కుమార్,కేంద్ర కమిటి సభ్యులు ఇర్ఫాన్ గుల్,కోట రమేష్,అనిల్,హైద్రాబాద్ జిల్లా కార్యదర్శి జావెద్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News