Thursday, January 23, 2025

కాంగ్రెస్… ఆవు పేడనూ వదల్లేదు : మోడీ వ్యంగ్యాస్త్రాలు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ప్రతి స్కీమ్ లోనూ స్కామ్ జరిగిందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దుయ్యబట్టారు. రేషన్ , మద్యం దగ్గర నుంచి చివరకు ఆవు పేడనూ వారు వదల్లేదని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్‌పుర్‌లో శనివారం జరిగిన ‘పరివర్తన్ మహా సంకల్ప్ ర్యాలీ ’లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

“ పేదలకు కాంగ్రెస్ చేసినంత అన్యాయం ఇంకెవరూ చేయలేదు. కొవిడ్ సమయంలో నేను పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద అందరికీ ఉచిత రేషన్ పంపిణీ చేస్తే , ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం అందులోనూ అవినీతికి పాల్పడింది. మద్యం విక్రయాల్లోనూ కుంభకోణానికి పాల్పడ్డారు. చివరకు ఆవు పేడనూ వదల్లేదు. (రాష్ట్ర ఆవు పేడ పేకరణ పథకాన్ని ఉద్దేశిస్తూ )అవినీతి దుర్మార్గ పాలనలో ఈ రాష్ట్రం కూరుకుపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి స్కీమ్ లోనూ ఓ స్కామ్ జరిగింది” అని మోడీ ధ్వజమెత్తారు.

“ 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్లను మేం పూర్తి చేశాం. ఇప్పుడు కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది. అందుకే కులాల వారీగా రిజర్వేషన్లంటూ కొత్త గిమ్మిక్కు మొదలు పెట్టింది. మహిళలను విడదీయాలనుకుంటోంది. వారి అసత్యాల వలలో పడవద్దు ” అని మోడీ హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రజల కలలే తన తీర్మానాలని, ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ఆ కలలను సాకారం చేసేందుకు ఎలాంటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటానన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారం లోకి రాగానే ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మిస్తామని, తొలి కేబినెట్ సమావేశం లోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News