షాజాపూర్ : మధ్యప్రదేశ్‌లో బీజేపీ సునామీ కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకలిస్తుందని, మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీపై అద్భుతమైన మద్దతు ప్రకటిస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ నెల 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా షాజాపూర్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ బహిరంగ సభలకు భారీ ఎత్తున ప్రజలు హాజరవుతున్నారని, చాలా మంది ఎండను సైతం లెక్క చేయకుండా నిల్చుని ప్రసంగాలను వింటున్నారని పేర్కొన్నారు. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి ప్రపంచం మొత్తం మీద ప్రశంసలు అందుకుంటోందని, చాలా దేశాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని వివరించారు.
ప్రస్తుతం భారత్ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, త్వరలోనే మనం మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతామని నిపుణులు చెబుతున్నారని అన్నారు. తనకు మూడోసారి అవకాశమిస్తే భారత్‌ను ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగేలా చేస్తామని చెప్పారు. భారీ పారిశ్రామిక హబ్‌గా షాజాపూర్ అభివృద్ధి చెందేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు రానుందని , దీనివల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను లక్షంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, ఎక్కడైతే కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందో అక్కడ ఒక కుటుంబం సంక్షేమం కోసమే పనిచేస్తుందని, గాంధీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ధ్వజమెత్తారు.
దోపిడీ చేయడం, అరాచకాలు చేయడమే కాంగ్రెస్ అజెండాగా పేర్కొన్నారు. హిందీలో మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులను ప్రవేశ పెట్టడాన్ని ఉదహరిస్తూ పేద ప్రజలు డాక్టర్లు, ఇంజినీర్లు కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. అందువల్లనే బీజేపీ ప్రభుత్వం ఈ కోర్సులను హిందీలో ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం దేశం దీపావళిని జరుపుకుందని, రెండో దీపావళిని డిసెంబర్ 3 న జరుపుకుంటుందని, ఆ రోజు మధ్యప్రదేశ్‌తోసహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.