రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం, కొవిడ్‌లాంటి పలు అంశాలను లేవనెత్తిన ప్రతిపక్షాలు
ప్రధాని పాల్గొంటారని ఆశించాం : కాంగ్రెస్
ప్రధాని రావాలన్న ఆనవాయితీ లేదన్న మంత్రి ప్రహ్లాద్ జోషీ
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలన్నీ మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరలకు చట్టపరమైన గ్యారంటీ కల్పించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. అలాగే ధరల పెరుగుదల, కరోనా వైరస్‌కట్టడి లాంటి పలు అంశాలను లేవనెత్తాయి. అయితే ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాలేదు. ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. సమావేశం అనంతరం రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే విలేఖరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశంలో పాల్గొని ఏదయినా సమాచారం తమతో పంచుకుంటారని తాము భావించామని చెప్పారు. మూడు సాగు చట్టాల రద్దు గురించి మరిన్ని వివరాలను అడగాలని తాము అనుకున్నామని, ఈ చట్టాలను వేరే రూపంతో మళ్లీ తీసుకు వచ్చే అవకాశముందనే భయాందోళన వ్యక్తమవుతోందని ఆయన చెప్పారు.
సాగు చట్టాలపై నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పెట్రోలు ధరల పెరుగుదల, చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తలను ప్రస్తావించింది. . రైతు సమస్యలతో పాటుగా కొవిడ్ సన్నద్ధత, గత వైఫల్యాలు, ద్రవ్యోల్బణం, పెట్రో ధరలు, నిరుద్యోగం, ఆర్థిక స్థితి, సరిహద్దు రాష్ట్రాల్లో బిఎస్ పరిధి విస్తరణ వంటి పలు అంశాలను వివిధ పార్టీలు ప్రస్తావించాయి. తామంతా రైతుల సమస్యలను ప్రస్తావించాం. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం, విద్యుత్ బిల్లు ఉపసంహరణను ప్రాధాన్యత ప్రకారం చేపట్టాలి అని ఖర్గే చెప్పారు. ప్రభుత్వం 26 బిల్లులను ఈ సమావేశంలో ప్రవేశపెట్టాలని భావిస్తోందని, మరో వైపు ప్రతిపక్షాలు అనేక సమస్యలను లేవనెత్తాలని అనుకుంటున్నాయని, సమావేశాలు కేవలం 19 రోజులే జరుగుతున్నందున వీటన్నిటికి తగినంత సమయం లభించదేమోనని అనిపిస్తోందని ఖర్గే చెప్పారు.
టిఎంసి నేతలు సుదీప్ బందోఫాధ్యాయ, డెరిక్ ఒబ్రియాన్‌లు నిత్యావసర సరకుల ధరల పెరుగుదలతో పాటుగా పది అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు రావాలని, కొవిడ్ పరిస్థితిపై చర్చ జరగాలని కూడా వారు డిమాండ్ చేశారు. జమ్మూ, కశ్మీర్‌కు వీలయినంత త్వరగా రాష్ట్రప్రతిపత్తి కల్పించాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కాగా అఖిలపక్ష సమావేశానికి ప్రధాని హాజరు కావాలన్న సంప్రదాయం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. స్పీకర్ అనుమతితో ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అం శాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. సమావేశానికి 31 పార్టీల నేతలు హాజరయినట్లు జోషీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీనుంచి ఖర్గేతో పాటుగా అధిర్ రంజన్‌చౌధురి, ఆనంద్ శర్మ, డిఎంకు తరఫున టిఆర్ బాలు, తిరుచ్చి శివ, శరద్ పవార్ ( ఎన్‌సిపి), వినాయక్ రౌత్( శివసేన), రాంగోపాల్ యాదవ్ (ఎస్‌పి), సతీశ్ మిశ్రా ( బిఎస్‌పి), ప్రసన్న ఆచార్య( బిజెడి), టిఆర్‌ఎస్, వైసిపి తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. కాగా సమావేశంలో తమకు మాట్లాడే అవకాశమివ్వలేదని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ వాకౌట్ చేసింది.