బారాబంకీ: “ప్రతిపక్షాలు కేవలం ‘ఓటు బ్యాంకు రాజకీయాలకు’ మాత్రమే పాల్పడ్డాయని, ట్రిపుల్ తలాక్ వంటి ఆచారలతో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ముస్లిం మహిళల సమస్యలపై శ్రద్ధ చూపలేదు” అని ప్రధాని నరేంద్ర మోడీ తమ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఆయన బారాబంకీ, అయోధ్య జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఇలా చెప్పారు. బిజెపి చేపట్టిన ఉచిత రేషన్ వల్ల పేదలు లబ్ధి పొందారని, కరోనా మహమ్మారి కాలంలో వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారని ఆయన అన్నారు. తమ డబుల్‌ఇంజిన్ ప్రభుత్వం(రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం) యువతుల భద్రత, హోదాకు ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్, పారా మిలిటరీలో పెద్ద ఎత్తున మహిళల రిక్రూట్‌మెంట్ చేపట్టినట్లు ఆయన ఈ సందర్భంగా ఉదాహరించారు. “నేడు మన ఆడపిల్లలు దేశాన్ని, సమాజాన్ని రక్షించే కమాండోలుగా రూపొందారు. పెద్ద సంఖ్యలో రిక్రూట్ అయ్యారు. ఆరేడేళ్ల క్రితం మహిళా పోలీస్ సిబ్బందిలో దేశవ్యాప్తంగా లక్ష మంది మహిళలు మాత్రమే ఉండేవారు. నేడు వారి సంఖ్య 2.25కి పెరిగింది” అన్నారు.
ఆయన ప్రతిపక్ష నాయకులు అన్నదానిపై విరుచుకుపడుతూ “వారు నాకు కుటుంబంలేదని, కనుక కుటుంబ బాధలు తెలియవని అంటున్నారు. కానీ నాకు ఉత్తరప్రదేశ్, యావత్ దేశం కుటుంబమే” అని మోడీ అన్నారు.“తమకు కుటుంబాలు ఉన్నాయంటున్న ఈ రాజవంశీయులను ముస్లిం మహిళల గురించి ఎందుకు చింతించడంలేదని అడగాలనుకుంటున్నాను. ముస్లిం సోదరీమణులు, కూతుళ్ల బాధలు వారికి పట్టవా? ఆ మహిళలు తమ పుట్టింటికి బలవంతంగా పంపించేయబడినప్పుడు వారి బాధలు వారికి పట్టవా? ఈ రాజవంశ పాలకులకు ముస్లింల ‘ఓటు బ్యాంకే’ ముఖ్యం తప్ప వారి కష్టనష్టాలు పట్టవు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళల కష్టాలు ఇబ్బడిముబ్బడి అయినప్పుడు వారు కళ్లు మూసేసుకుంటారు. కానీ మా ప్రభుత్వం ఈ ట్రిపుల్ తలాక్ విషవలయం నుంచి ముస్లిం మహిళలను బయటి తీసుకొచ్చింది” అన్నారు. బారాబంకీ జిల్లాలోని చిన్న సన్నకారు రైతుల సమస్యలు తీర్చడానికి తమ ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ. 800 కోట్లు బదిలీచేసింది” అన్నారు. తమ ప్రభుత్వం ‘గోవర్ధన్ పథకాన్ని’ ఆరంభించిందని, అందులో పశువుల పేడను ఉపయోగించి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పనితీరు వల్ల ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రజలకు తమపై ఎక్కువ విశ్వాసం ఏర్పడిందన్నారు. ఇదిలావుండగా బారాబంకీ, అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్ల ఐదో దశ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరుగనున్నాయి.