Tuesday, November 5, 2024

రైతుజయభేరి

- Advertisement -
- Advertisement -

PM Narendra Modi repealed Farm laws

3 కొత్త సాగు చట్టాలు రద్దు

దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణ

జాతికి క్షమాపణ చెబుతూనే నిజాయితీతో కూడిన నిర్మల హృదయంతో నేనొక మాట చెప్పదలచుకున్నాను. మన అంకితభావంలో, తపస్సులో ఎక్కడో లోపం కనిపిస్తున్నది. అందుకే కొంతమంది మన రైతు సోదరులకు వాస్తవాన్ని దీపపు వెలుగంత స్పష్టంగా చెప్పలేకపోయాను. నేడు ప్రకాశ్ పర్వదినం ఎవరినీ నిందించడానికి ఇది సమయం కాదు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయించామని నేను దేశ ప్రజలకు తెలియజేస్తున్నాను.

కేంద్రం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రాజీలేని మొక్కవోని దీక్షతో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, దాదాపు 800 మంది సహచరులను కోల్పోయి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాదిగా సాగిస్తున్న ఉద్యమం ఘన విజయం సాధించింది. ఆ మూడు చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయించినట్టు గుర్‌నానక్ జయంతి సందర్భంగా శుక్రవారం నాడు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన జాతికి క్షమాపణలు చెప్పడం రైతు ఉద్యమం కీర్తి పతాకగా చెప్పవచ్చు. ఈ వార్త విని దేశమంతటా రైతులు, ప్రజలు ఆనందోత్సాహాలలో మునిగి తేలారు. ఢిల్లీ సరిహద్దుల్లోని రైతు ఉద్యమకారులు స్వీట్లు పంచుకొని విజయోత్సవం చేసుకున్నారు.

న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న వేళ .. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం మూడు సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ఉదయం గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్తున్నానని ప్రధాని అన్నారు.‘ మా ప్రభుత్వం ఏం చేసినా అది రైతుల కోసమే. ఏం చేస్తున్నా అది దేశం కోసమే. మూడు సాగు చట్టాలను కూడా రైతుల ప్రయోజనాల కోసమే చిత్తశుద్ధితో తీసుకు వచ్చాం. ముఖ్యంగా సన్నకారు రైతులకు ఈ చట్టాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని వర్గాల రైతులకు ఈ చట్టాలపై సర్ది చెప్పలేక పోయాం. అందుకే మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం.

ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి రాజ్యాంగపరమైన ప్రక్రియను ప్రారంభిస్తాం. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నా. రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలి’ అని ప్రధాని మోడీ అన్నారు. ‘ గత అయిదు శతాబ్దాలుగా రైతుల కష్టాలను దగ్గరుండి చూశా. అందుకే 2014లో ఈ దేశం నన్ను ప్రధానిని చేసినప్పుడు రైతుల సంక్షేమం, అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశంలో 80 శాతం సన్నకారు రైతులే అనే విషయం చాలా మందికి తెలియదు.10 కోట్ల మంది రైతులకు రెండు హెక్టార్లకంటే తక్కువ భూమే ఉంది. అదే వారి జీవనోపాధి. అందుకే వారి సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పూర్తి నిజాయితీతో మా ప్రభుత్వం ఈ సాగు చట్టాలను తీసుకు వచ్చింది. రైతుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను తీసుకు వచ్చాం. వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చాం.

వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచాం. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచాం. కనీస మద్దతు ధరలను పెంచాం. రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా కృషి చేస్తున్నాం. ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తాం. ఇకపై రైతుల సంక్షేమం కోసం మరింతగా కష్టపడి పని చేస్తాం’ అని ప్రధాని చెప్పారు.

2020లో మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకు వచ్చింది. ఇవి వివాదాస్పదంగా ఉండడంతో రైతులు రోడ్డెక్కారు. వెంటనే ఈ వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా గుడారాలు వేసుకుని రైతులు నిరసన వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. అదే సమయంలో ఈ చట్టాలు రైతులను కార్పొరేట్లకు బానిసలను చేస్తాయంటూ ప్రతిపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా అయిదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, యుపి, పంజాబ్‌లలో రైతు ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతూ ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దిగివచ్చిన కేంద్రం ఇప్పుడు రైతు చట్టాలను రద్దు చేసింది.

వెంటనే ఉద్యమాన్ని విరమించం
పార్లమెంటులో చట్టాలు రద్దయ్యే దాకా వేచి చూస్తాం
ప్రధాని ప్రకటనపై బికెయు నేత తికాయత్ స్పష్టీకరణ

ఘజియాబాద్/పాల్ఘర్: నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సంచలన ప్రకటనపై రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్( బికెయు) నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. చట్టాల రద్దుపై ప్రధాని ప్రకటన చేసినప్పటికీ తాము ఇప్పుడే ఉద్యమాన్ని విరమించబోమని చెప్పారు. ‘ ఆందోళనను ఇప్పటికిప్పుడే విరమించబోం. పార్లమెంటులో మూడు చట్టాల రద్దు జరిగే రోజు వరకు వేచి చూస్తాం. ఇక కనీస మద్దతు ధరతో పాటు ఇతర అంశాలపై ప్రభుత్వం రైతులతో చర్చించాల్సి ఉంది’ అని ఒక కార్యక్రమం కోసం శుక్రవారం మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు వచ్చిన తికాయత్ ట్వీట్ చేశారు. కాగా ప్రధాని మోడీ పార్లమెంటులో మూడు సాగు చట్టాలను రద్దు చేయించడంతో పాటుగా కనీస మద్దతు ధర( ఎంఎస్‌పి)పై గ్యారంటీ ఇవ్వాలి అని పాల్ఘర్‌లో మాట్లాడుతూ తికాయత్ అన్నారు. అంతేకాదు ఆందోళన కొనసాగాల్సి ఉన్నందున ఇప్పుడు స్వీట్లు పంచుకోవడం, సంబరాలు జరుపుకోవడం లాంటివి చేయవద్దని కూడా ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సింఘు సరిహద్దులోని కిసాన్ మోర్చా ప్రధాన కార్యాలయం వద్ద మోర్చాకు చెందిన తొమ్మిది మంది సభ్యుల బృందం సమావేశం జరగనుందని, ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తాను ఈ రోజు రాత్రికి ఢిల్లీ సరిహద్దులకు తిరిగి వెళ్లనున్నట్లు కూడా ఆయన చెప్పారు.

సరిహద్దుల్లో సంబరాలు

సాగు చట్టాల రద్దుపై ప్రధాని మోడీ ప్రకటన చేయడంతో దేశ రాజధాని సరిహద్దుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఆందోళనలో పాల్గొంటున్న రైతులు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. కేంద్రం నిర్ణయంపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.‘ ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పార్లమెంటులో ప్రక్రియ పూర్తయిన తర్వాతే చట్టాల రద్దు అమలులోకి వస్తుంది. అదే జరిగితే.. ఏడాది పాటు రైతులు సాగించిన పోరాటానికి విజయం లభించినట్లే’ అని ఎస్‌కెఎం వెల్లడించింది. కాగా ఆందోళన సమయంలో ప్రాణాలు కోల్పయిన వందలాది మంది రైతులకు శాంతి కలగడం కోసం ఘాజీపూర్ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు శుక్రవారం ప్రత్యేక యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్‌కెఎం సభ్యుడు రాజేంద్ర యాదవ్ చెప్పారు. సింఘు సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు సైతం ప్రధాని ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. అయితే పార్లమెంటులో ఈ చట్టాలను ఆమోదించడం జరిగిందని, అక్కడే వీటిని రద్దు చేయాల్సి ఉందని కీర్తి కిసాన్ యూనియన్‌కు చెందిన హర్మేష్ సింగ్ దేషి అంటూ, చట్టాలను రద్దు చేసిన వెంటనే తామంతా ఇళ్లకు తిరిగి వెళ్తామని చెప్పారు.

ఆ మూడు చట్టాలు

1.‘ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం.
2. రైతులతో చేసుకునే కాంట్రాక్టు సాగు ఒప్పందాలకు రక్షణ కల్పించే ‘ది ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ చట్టం 2020’.
3. నిత్యావసర సరుకుల(సవరణ) చట్టం 2020. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ చట్టానికి కొన్ని సవరణలు చేసి కొత్త రూపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News