సూరత్: ప్రధాని నరేంద్ర మోడీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా గురువారం సూరత్‌లో రోడ్‌షో నిర్వహించి, తెల్లవారుజాము నుండి రోడ్డు పక్కన నిలబడి ఉన్న ప్రజలకు చేయి ఊపుతూ గ్రీట్ చేశారు. ప్రధాని మోడీ రూ. 29,000 కోట్ల విలువచేసే వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేయనున్నారు. తన స్వంత రాష్ట్రమైన గుజరాత్ లో ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరుగనున్నాయి.
మోడీ సూరత్ విమానాశ్రయంలో ఉదయం దిగిన తర్వాత, ఘోడదర నుండి నగరంలోని లింబయత్ ప్రాంతానికి 2.5 కిలోమీటర్ల రోడ్‌షో నిర్వహించారు. ప్రధాని తన కారులో నుంచి రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఉన్న ప్రజలకు చేయి ఊపారు. గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వివిధ ప్రాజెక్టులు ఆవిష్కరించేందుకు మోడీ సూరత్ నుంచి భావ్ నగర్ వెళ్లనున్నారు. కాగా భావ్‌నగర్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్ జి టెర్మినల్ , బ్రౌన్‌ఫీల్డ్ పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన తెలిపింది.