తాజా వేడివేడి ఆహారం
మధ్యాహ్న భోజనం రద్దు
కేంద్ర కేబినెట్ ఆమోదం
11 కోట్ల మంది పిల్లలకు వర్తింపు
న్యూఢిల్లీ : ఇక దేశంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బదులుగా సరికొత్తగా పిఎం పోషకాహారం స్కూళ్లలో లభిస్తుంది. దేశంలోని స్కూళ్లలో పిల్లలకు వేడివేడి తాజా పోషకాహారం పథకానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సిసిఇఎ) భేటీ జరిగింది. పిఎం పోషన్ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు భేటీ తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. దేశంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ ఎలిమెంటరీ స్కూళ్లలో విద్యార్థులకు సిద్ధాన్నం వడ్డిస్తారు. దీనితో 1 నుంచి 8వ తరగతుల పిల్లలు భోజనం పొందేందుకు వీలేర్పడుతుంది. ఇప్పుడున్న మధ్యాహ్న భోజనం స్థానంలో ఈ పిఎం పోషన్ శక్తి నిర్మాణ్ స్కీంను అమలులోకి తెస్తారని మంత్రి వివరించారు. ఇప్పటి భోజనానికి అదనంగా పలు అదనపు పదార్థాలను జోడించి పిల్లలకు ఆహారం అందిస్తారు.
వచ్చే ఐదేళ్లు అంటే 2021 22 విద్యా సంవత్సరం నుంచి 202526 విద్యాసంవత్సరం వరకూ ఈ జాతీయ పోషన్ పథకం అమలు చేసేందుకు సంకల్పించారు. దీనికి సంబంధించి రూ 54,061 కోట్లకు పైగా కేంద్రం నుంచి రూ 31,737కు పైగా రాష్ట్రాల నుంచి కేటాయింపులు ఉంటాయని మంత్రి తెలిపారు. ఇక ఆహార ధాన్యాల అవసరానికి అయ్యే రూ 45,000 కోట్ల అదనపు వ్యయాన్ని కేంద్రం భరిస్తుందని చెప్పారు. మొత్తం ఈ స్కీం వ్యయ భారం రూ 1,30,794 కోట్లకు పైగా ఉంటుందని వివరించారు. ఈ విధంగా ఇది భారీ విద్యార్థి పౌష్టికాహార పథకంగా ఉంటుందన్నారు. దేశంలోని 11.20 లక్షల స్కూళ్లలో చదివే 11.80 కోట్ల మందివిద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.
పోషకాహార లోపం నివారణకు ప్రాధాన్యత
పథకంపై ప్రధాని స్పందన
పిఎం పోషన్ స్కీం బాలల్లో పోషకాహార లోపం నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోడీ ఈ స్కీంపై స్పందిస్తూ తెలిపారు. పౌష్టికాహార లోపం నివారణకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. బాలలకు సరైన పోషకవిలువలు ఉండే తాజా ఆహారం అందించాల్సి ఉంటుంది. ఈ దిశలో తమ ప్రభుత్వం చేయాల్సిందంతా చేసి తీరుతుందని తెలిపారు. దేశానికి కాబోయే యువజనులకు ఈ పథకం మేలు చేస్తుందన్నారు.
ఎగుమతులకు ప్రోత్సాహం
రైల్వే డబ్లింగ్ పనుల వేగిరం
బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి భేటీలో ఎగుమతులను మరింతగా ప్రోత్సహించాలని సంకల్పించారు. ఇదే విధంగా రైల్వే మార్గాల డబ్లింగ్ పనులను వేగిరపర్చాలని తలపెట్టారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రి మండల ఆమోదం తెలిపింది. సంబంధిత వివరాలను ఆ తరువాత మంత్రులు పీయూష్ గోయల్ , అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. కొవిడ్ ఇతరత్రా కష్టాలు సవాళ్లు ఉన్నప్పటికీ సెప్టెంబర్ 21 నాటికి దేశంలో రూ 185బిలియన్ల మేర ఎగుమతులు జరిగాయని పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వశాఖను చూసే గోయల్ వివరించారు.
ఇది అత్యంత అరుదైన రికార్డు అన్నారు. ఇక ప్రభుత్వ ఆధీనంలోని ఎక్స్‌పోర్టు క్రెడిట్ గ్యారంటీ కార్ప్(ఇసిజిసి)ని స్టాక్‌మార్కెట్ లిస్టింగ్‌లో చేర్చే నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేళ్లకు సంబంధించి ఈ సంస్థకు ప్రభుత్వం రూ 4,400 కోట్లు అదనపు మూలధనం సమకూరుస్తుంది. ఇది 202122 ఏడాది నుంచి ఆరంభం అవుతుంది. తక్షణం ఈ సంస్థకు రూ 500 కోట్లు సమకూరుస్తారని మంత్రి వివరించారు. ఇక స్టాక్ మార్కెట్ లిస్టింగ్ ప్రక్రియ వచ్చే ఏడాది జరుగుతుంది. జాతీయ ఎగుమతుల బీమా నిధి ( ఎన్‌ఇఐఎ)స్కీంలోకి రూ 1,650 కోట్లు సమకూరుస్తారు
రైల్వేలకు డబ్లింగ్ వివరాలు
రెండు రైల్వే లైన్ల డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ 1,095.88 కోట్ల వ్యయ అంచనాలతో నిమాచ్ రట్లామ్ డబ్లింగ్ జరుగుతుంది. రాజ్‌కోట్ కనాలూస్ రైల్వే లైన్ పనులకు ఆమోదం దక్కింది. దీనికి రూ 1088 కోట్లు వ్యయం అంచనా వేశారు. ఈ రెండు పనులు నాలుగేళ్లలో పూర్తి కావాలని సంకల్పించారు.
సౌరాష్ట్ర మధ్యప్రదేశ్‌లకు ఎంతో మేలు
డబ్లింగ్ పనులపై ప్రధాని
కేంద్రం ఆమోదం తెలిపిన రాజ్‌కోట్ కనాలూస్ రైల్వే లేన్‌తో సౌరాష్ట్ర ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని తెలిపారు. ఇక నిమాచ్ రట్లామ్ లైన్‌తో మధ్యప్రదేశ్ మారుమూల ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఆయా ప్రాంతాల ఆర్థిక, సామాజిక పురోగతికి , పనిలో పనిగా గ్రామీణ పర్యాటకం ఎంతగానే విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.