బెంగళూరు నీటి కరవుపై ప్రధాని మోడీ
కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడిన ప్రధాని
దేశాన్ని అన్ని రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మారుస్తామని హామీ
ఇండియా కూటమికి మాత్రం మోడీని తప్పించడమే లక్షమని విమర్శ
ప్రధాని విమర్శకు సిద్ధరామయ్య గట్టి సమాధానం
నీటి కరవుతో కర్నాటక ఇబ్బంది పడుతుంటే ప్రధాని మోడీ ఎక్కడ ఉన్నారు?
బెంగళూరు : టెక్ సిటీని ట్యాంకర్ సిటీగా మార్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్‌కే దక్కుతుందని బెంగళూరు నీటి కటకటపై ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో ఒక ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతూ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని మోడీ కష్ట పడుతున్నట్లు చెప్పారు. కానీ, ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు మాత్రం మోడీని తొలగించడమే లక్షంగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే, ఆ విమర్శలను కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిప్పికొట్టారు.
వరదలు, కరవుతో కర్నాటక ఇబ్బంది పడుతుంటే ప్రధాని మోడీ ఎక్కడ ఉన్నారని సిద్ధరామయ్య ప్రశ్నించారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ, కర్నాటకను పెట్టుబడుల వ్యతిరేక, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యతిరేక, ప్రైవేట్ రంగ వ్యతిరేక, పన్ను చెల్లింపుదారు వ్యతిరేక, సంపద సృష్టి వ్యతిరేక రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దిందని విమర్శించారు. కానీ, మోడీ మాత్రం దేశాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్‌గా, ఫార్మా హబ్‌గా, ఎలక్ట్రానిక్స్ హబ్‌గా, విద్యుత్ వాహనాల హబ్‌గా, ప్రపంచ సృజనాత్మక హబ్‌గా తీర్చిదిద్దాలని, తద్వారా భారత్‌ను ప్రపంచ ఆర్థిక కేంద్రంగా మార్చాలని కష్టపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. దేశంలో ఇప్పటికే 5జిని అందుబాటులోకి తీసుకువచ్చామని, త్వరలోనే 6జి తీసుకువస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
ఇది మోడీ గ్యారంటీ అని ఆయన చెప్పారు. దేశానికి కృత్రిమ మేధ తీసుకువస్తామని మోడీ హామీ ఇస్తుంటే ప్రతిపక్షాల కూటమి మాత్రం మోడీని తొలగిస్తామని చెబుతోందని, చంద్రయాన్ ద్వారా ప్రపంచ దేశాల ముందు భారతీయులు గర్వించేలా మోడీ హామీ ఇస్తుంటే, ఇండియా కూటమి నేతలు మాత్రం మోడీని తొలగిస్తామని హామీ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. కర్నాటక రాష్ట్ర ప్రజల కలల సాకారం నిమిత్తం జనతా దళ్ సెక్యులర్ (జెడిఎస్) బిజెపి కలసి పని చేస్తాయని మోడీ తెలిపారు. ‘మీ కలలను సాకారం చేస్తామని హామీ ఇస్తున్నా& నా జీవితాన్ని మీ కోసం, దేశం కోసమే అంకితం చేశా’ అని ప్రధాని మోడీ కర్నాటక ప్రజలకు హామీ ఇచ్చారు.