ఢాకా: ప్రధాన ప్రతిపక్షం బిఎన్‌పి, దాని మిత్ర పక్షాల బహిష్కరణ, పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనల నడుమ జరిగిన బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలలో వామీ లీగ్ పార్టీ భారీ విజయాన్ని సాధించగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వరుసగా నాలుగవ పర్యాయం ప్రధాని పీఠాన్ని అధిష్టించి రికార్డు సృష్టించారు. 300 స్థానాలు గల పార్లమెంట్‌లో 299 స్థానాలకు ఎన్నికలు జరగగా హసీనా సారథ్యంలోని ఆవామీ లీగ్ పార్టీ 223 సీట్లు గెలుచుకుంది. ఒక అభ్యర్థి మరణంతో వాయిదాపడిన ఆ ఒక్క స్థానానికి తర్వాత ఎన్నిక జరగనున్నది. పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షమైన జాతీయ పార్టీ 11 స్థానాలలో గెలుపొందగా బంగ్లాదేశ్ కళ్యాణ్ పార్టీ ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు 62 స్థానాలు చేజిక్కించుకున్నారు. జాతీయ సమాజ్‌తాంత్రిక్ దళ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. ఆవామీ లీగ్ పారీకి అధ్యక్షురాలిగా ఉన్న 76 సంవత్సరాల గోపాల్‌గంజ్-3 నియోజకవర్గంలో భారీ మెజారిటీతో ఎనిమిదవసారి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
2009 నుంచి బంగ్లాదేశ్‌ను ప్రధానిగా పాలిస్తున్న షేక్ హసీనా వరుసగా రెండవపర్యాయం నాలుగవసారి ప్రధాని పదవిని చేపట్టి రికార్డు సృష్టించారు. 1991లో దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తర్వాత ఇంతవ తక్కువ శాతం ఓటింగ్ జరగడం ఇది రెండవసారి. 1996 ఫిబ్రవరి ఎన్నికలలో కేవలం 26.5 శాతం పోలింగ్ జరిగింది. ఆదివారం జరిగిన ఎన్నికలలో సాయంత్రం 3 గంటల వరకు 27.15 శాతం పోలింగ్ మాత్రమే జరగగా సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిన అనంతరం దాదాపు 40 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అరగంటలోపల 13 శాతం పోలింగ్ జరగడం పట్ల ప్రతిపక్షాలు విస్మయం వ్యక్తం చేశాయి. ఈ గెలుపుతో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్‌ను సుదీర్ఘకాలంపరిపాలిస్తున్న ప్రధానిగా షేక్ హసీనా ఘనతను సొంతం చేసుకున్నారు. ఆవామీ లీగ్ అభ్యర్థులు, ఆవామీ లీగ్ స్వతంత్రుల మధ్య జరిగిన ఆదివారం ఎన్నికల ఫలితలపై ప్రజలు ఆసక్తిని కనబరచకపోవడం విశేషం. ఎన్నికలకు ముందు హసీనా ప్రభుత్వం వందల సంఖ్యలో ప్రత్యర్థ పార్టీల నాయకులను, వారి మద్దతుదారులను అరెస్టు చేయగా ఇది ప్రతిపక్షాన్ని దెబ్బతీసే ప్రయత్నమేనని పౌర హక్కుల సంస్థలు విమర్శించాయి.
బూటకపు ఎన్నికలను తిరస్కరిస్తున్నాం: బిఎన్‌పి
ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని ఆవామీ లీగ్ పార్టీ విజయం సాధించిన ఆదివారం జరిగిన ఎన్నికలను బూటకంగా మాజీ ప్రధాని ఖలీదా జియా సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బిఎన్‌పి) అభివర్ణించింది. ఈ డమ్మీ ఎన్నికలను రద్దు చేయాలని బిఎన్‌పి సోమవారం డిమాండ్ చేసింది. ఇంత తుక్కవ శాతంలో ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికలను తాము గుర్తించడం లేదని బిఎన్‌పి తెలిపింది. బిఎన్‌పి ఎన్నికలను బహిష్కరించి పోలింగ్ రోజున ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. ఎన్నికలను బూటకంగా అభివర్ణించిన బిఎన్‌పి మంగళవారం నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాన్ని ఉదృతం చేయనున్నట్లు ప్రకటించింది. 2014 ఎన్నికలను కూడా బహిష్కరించిన బిఎన్‌పి 2018 ఎన్నికలలో పాల్గొంది. బిఎన్‌పితోపాటు మరో 15 ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇప్పటి ఎన్నికలను బహిష్కరించాయి. ఇంత తక్కువ సంఖ్యలో పోలింగ్ జరగడమంటే తమ బహిష్కరణ ఉద్యమానికి ప్రజలు మద్దతిచ్చినట్లేనని బిఎన్‌పి పేర్కొంది. తమ శాంతియుత ప్రజాస్వామ్య ఆందోళనా కార్యక్రమాలు ఇక ఉదృతంగా సాగుతాయని, ప్రజలకు ఓటింగ్ హక్కు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆ పార్టీ తెలిపింది.
భారత్ మాకు గొప్ప మిత్రదేశం: హసీనా
భారత్ బంగ్లాదేశ్‌కు గొప్ప మిత్రదేశమని, చాలా సమస్యలను రెండు దేశాలుద్వైపాక్షికంగా పరిష్కరించుకున్నాయని వరుసగా నాలుగవసారిసారి గెలుపొందిన ప్రధాని షేక్ హసీనా తెలిపారు. 2009 నుంచిప్రధానిగా బంగ్లాదేశ్‌ను పాలిస్తున్న 76 ఏళ్ల షేక్ హసీనా సారథ్యంలోని ఆవామీ లీగ్ పార్టీ ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించింది. తన కుటుంబ సభ్యుల హత్యల తర్వాత ఆరేళ్లపాటు తానుభారత్‌లో అజ్ఞాతంలో ఉన్న రోజులను ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్‌కు భారత్ గొప్ప మిత్రదేశమని, 1971, 1975లో భారత్‌కు తమకు అండగా నిలబడిందని షేక్ హసీనా తెలిపారు. తనకు, తన సోదరికి, తన బంధువులకు భారత్ ఆశ్రయం కల్పించిందని ఆమె గుర్తు చేశారు. 1975లో షేక్ ముజిబూర్ రహ్మాన్‌ను, ఆయన భార్య్యను, ముగ్గురు కుమారులను వారి ఇంట్లోనే సైనికాధికారులు కాల్చిచంపారు. ఆ సమయంలో విదేశాలలో ఉన్న ముజిబూర్ రహ్మాన్ కుమార్తెలు హసీనా, రుహానా ప్రాణాలు దక్కించుకున్నారు. భారత్‌ను తమ పొరుగు మిత్రదేశంగా పరిగణిస్తామని,
తమ మధ్య అనేక సమస్యలు తలెత్తినప్పటికీ ద్వైపాక్షికంగా పరిష్కరించుకున్నామని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ హసీనా తెలిపారు. భారత్‌తో అద్భుతమైన సంబంధాలు తమ దేశానికి ఉన్నందుకు తాను గర్విస్తున్నానని ఆమె చెప్పారు. ప్రతి దేశంతో తనకు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయని, అదే తమ ఆశయమని ఆమె చెప్పారు. దేశం ఆర్థికంగా ప్రగతిని సాధించడమే తన రానున్న ఐదేళ్ల లక్షమని ఆమె చెప్పారు. తన ప్రజల కోసమే తాను పనిచేయడానికి ప్రయత్నిస్తానని ఆమె అన్నారు. తల్లి ప్రేమతో తనకు ఈ అవకాశం ఇచ్చిన తన ప్రజలను తాను చూసుకుంటానని, ప్రజలు తనను ఎప్పుడూ గెలిపిస్తూనే ఉన్నారని, వారి కారణంగానే తాను ఈ స్థానంలో ఉన్నానని ఆమె చెప్పారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, శ్రీలంక మాజీ ప్రధాని సిరిమావో బండారునాయకే వంటి ప్రపంచ నాయకులతో తతను విలేకరులు పోల్చగా ఆమె స్పందిస్తూ వారు చాలా గొప్ప మహిళామణులని, తాను చాలా చిన్న వ్యక్తినని, ఒక సామాన్యురాలినని హసీనా వినయంగా జవాబిచ్చారు.